సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు స్పౌజ్ కేటగిరిలో ఒక జిల్లా నుంచి మరో జిల్లా బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలంటూ గ్రామ/వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీలు పూర్తిగా ఉద్యోగి అభ్యర్థన ప్రాతిపదికన మాత్రమే ఉంటాయని, అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ చర్యలకు గురైన వారు, విజిలెన్స్ కేసులు నమోదైన వారి అభ్యర్ధనలు పరిగణనలోకి తీసుకోబోరని వెల్లడించారు.
భార్యాభర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్, కో–ఆపరేటివ్, ఎయిడెడ్ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న వారు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, భర్త లేదా భార్యలో ఒకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే ఈ ప్రక్రియలో బదిలీలకు అర్హత ఉండదని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే ఉద్యోగులు వారికి కావాల్సిన మండలాలు లేదంటే మున్సిపాలిటీలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వం కూడా బదిలీల ప్రక్రియలో కొత్త జిల్లాలో మండలాలు లేదంటే మున్సిపాలిటీలను ఆయా ఉద్యోగులకు కేటాయిస్తూ ఆదేశాలు ఇస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత మండలాలు లేదంటే మున్సిపాలిటీల్లో ఖాళీల మేరకు కౌన్సిలింగ్ ప్రక్రియలో నిర్ణీత సచివాలయం కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీరియల్‌గా ఈ బదిలీల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.


