ఇటీవల చిత్తూరులో ధర్నా చేస్తున్న మామిడి రైతులు
గిట్టుబాటు ధర విషయంలో ఆదుకోని బాబు సర్కారు
నేటికీ గుజ్జు పరిశ్రమలు చెల్లించని బకాయిలు రూ.350 కోట్లు
ఈ మొత్తాన్ని ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన
కిలోకు రూ.8 చొప్పున చెల్లించేందుకు తాము అంగీకరించలేదన్న పరిశ్రమల నిర్వాహకులు
మరో నాలుగు నెలల్లో మార్కెట్‌కు రానున్న పంట
ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ డిమాండ్
సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధర దక్కక గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. మద్దతు ధరగా కిలోకు రూ.12 ప్రకటించిన సర్కారు ఆ మేరకు రైతులకు ధర దక్కేలా చేయడంలో ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఇచ్చిన రాయితీ మొత్తాన్ని రైతులకు జమచేయడంతో తమ పని అయిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంది. మరోవైపు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలోకి రూ.8 చొప్పున ఇవ్వకుండా గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కూడా చేతులెత్తేయడంతో రానున్న సీజన్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన మామిడి రైతులను పీడిస్తోంది. ఈ నేపథ్యంలో.. మరో నాలుగు నెలల్లో మార్కెట్‌కు రానున్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం నిధులతో సరి..
వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితంగా చిత్తూరు జిల్లాలో 32,257 మంది నుంచి 3.72 లక్షల టన్నులు.. తిరుపతి జిల్లాలో 6,137 మంది నుంచి 67 వేల టన్నులు.. అన్నమయ్య జిల్లాలో 2,401 మంది నుంచి 24 వేల టన్నులు.. వెరసి 40,795 మంది రైతుల నుంచి 4.62 లక్షల టన్నుల మామిడి కాయలను గుజ్జు పరిశ్రమలు, వ్యాపారులు, మండిలోని ర్యాంపు నిర్వాహకుల ద్వారా సేకరించినట్లు లెక్కతేల్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.130 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, 1.62 లక్షల టన్నుల మామిడికి మార్కెట్, మద్దతు ధరల మధ్య వ్యత్యాసం ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
చివరికి.. లక్ష టన్నులకు రూ.109 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి మరో రూ.76 కోట్లు జతచేసి కిలోకు రూ.4 చొప్పున రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 14న విడుదల చేసింది. కానీ, ఇప్పటివరకు రూ.150 కోట్లకు మించి జమకాలేదని తెలుస్తోంది. పైగా.. ఈ–పంట డేటా ఆధారంగా రాయితీ సొమ్ము జమచేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం చివరికి, ఫ్యాక్టరీలు, ర్యాంప్ నిర్వాహకుల నుంచి సేకరించిన జాబితా ప్రకారం జమచేయడంతో అనర్హులే ఎక్కువగా లబ్ధిపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
చేతులెత్తేసిన పరిశ్రమలు.. పట్టించుకోని ప్రభుత్వం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలోకు రూ.8 చొప్పున చెల్లించాల్సిన గుజ్జు పరిశ్రమలు, ర్యాంప్ నిర్వాహకులు ఆ మొత్తాన్ని చెల్లించడంలో చేతులెత్తేశాయి. కొన్ని పరిశ్రమలు రూ.3–4లు, మరికొన్ని పరిశ్రమలు రూ.4–5 చొప్పున చెల్లించాయి. ర్యాంపుల్లో అయితే రూ.3కు మించి చెల్లించిన దాఖలాల్లేవు. మరికొన్ని ఫ్యాక్టరీలైతే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. రూ.8 చొప్పున ఫ్యాక్టరీలు, ర్యాంప్ నిర్వాహకుల నుంచి రూ.400 కోట్లు జమకావాల్సి ఉండగా, కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు 40 వేల మందికి రూ.350 కోట్లకు పైగా రావాల్సి ఉండడంతో ఆ మొత్తం కోసం రైతులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.
అయినా సరే ప్రభుత్వం పట్టనట్లుగా ఉంది. కిలో రూ.8 చొప్పున చెల్లించేందుకు తాము అంగీకరించలేదని, అలాంటప్పుడు ఏ విధంగా చెల్లిస్తామని గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్లుగా ఎగుమతుల్లేక ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన పల్ప్ నిల్వలకు మార్కెటింగ్‌లో సహకరించాలని మొరపెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వమే హామీ ఇచ్చినందున తమకు రావాల్సిన మొత్తం చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. గత సీజన్‌లో తలెత్తిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న సీజన్‌లో మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ జగన్ చొరవతోనే కిలోకు రూ.4 సబ్సిడీ..
చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 56 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి, అల్ఫాన్సా, బెనిషా, మల్లికతో పాటు దాదాపు 10 రకాల వెరైటీలు సాగవుతున్నాయి. అత్యధికంగా 40 వేల హెక్టార్లలో తోతాపురి రకమే సాగవుతోంది. ఇలా అన్ని రకాల మామిడి కలిపి గతంలో 6.45 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. తోతాపురి అయితే 5.60 లక్షల టన్నుల వరకు వచ్చిందని అంచనా. అయితే, తోతాపురి వెరైటీ మామిడిని అమ్ముకునేందుకు రైతులు గత సీజన్‌లో ఎన్నడూలేని రీతిలో పడరాని పాట్లు పడ్డారు. ధరలేక.. కొనేవారు లేక రోడ్డెక్కిన వీరికి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలవడంతో కిలో రూ.12లకు తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కిలో రూ.12 చొప్పున 5.60 లక్షల టన్నుల కొనుగోలుకు రూ.672 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. కానీ, ఆ రేటుకు కొనేందుకు గుజ్జు పరిశ్రమలు ముందుకురాకపోవడంతో సబ్సిడీ రూపంలో కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందని, ఫ్యాక్టరీలు రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే, తాము చెల్లిస్తామన్న సబ్సిడీ మొత్తం విడుదలలో తొలుత చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, షార్ట్‌టర్మ్ రుణం రూపంలో కార్పొరేషన్ల ద్వారా సమీకరించుకోవాలంటూ ఉద్యాన శాఖను ఆదేశించింది.


