సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాళ్ల ఫోన్లు లాక్కున్న పోలీసులు.. భయబ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటరెడ్డి సతీమణి హరిత సాక్షితో మాట్లాడుతూ.. నా భర్తకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు. వాటిని మాకు కనీసం చూపించలేదు. పోలీసులు మా ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు. నా భర్తను తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారి నోరు మూయించడం సరికాదు అని అన్నారు.
కేసు ఏంటంటే..
టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీసులు 352, 353(1)(2), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


