పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో జరిగే సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ప్రధాని.. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని సందర్శించి.. నివాళి అర్పిస్తారు. 10.30 గంటలకు సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఈ సందర్భంగా సత్యసాయి జీవనం, ప్రబోధాలు, చిరకాల వారసత్వానికి గుర్తింపుగా స్టాంపు, నాణేన్ని విడుదల చేస్తారు. అనంతరం సత్యసాయి భక్తులు, అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తమిళనాడుకు వెళ్తారు. కోయంబత్తూరులో మధ్యాహ్నం 1.30 గంటలకు దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు ‘పీఎం కిసాన్’ 21వ విడత కింద రూ.18,000 కోట్లకు పైగా నిధుల్ని విడుదల చేస్తారు. ఈ సదస్సును తమిళనాడు నేచురల్ ఫార్మింగ్ స్టేక్ హోల్డర్స్ ఫోరమ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తోంది.
ఈ సదస్సులో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన రైతులు, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న వారు, శాస్త్రవేత్తలు, సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేసే సంస్థల ప్రతినిధులు, అమ్మకందారులతో పాటు 50 వేలకు పైగా ఆసక్తిదారులు పాల్గొంటారని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.


