స్వచ్ఛత పెర'గాలి' | Vijayawada ranks 13th in clean air survey | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత పెర'గాలి'

Sep 10 2025 5:39 AM | Updated on Sep 10 2025 5:39 AM

Vijayawada ranks 13th in clean air survey

స్వచ్ఛ వాయు సర్వేక్షణలో విజయవాడకు 13వ ర్యాంకు 

విశాఖపట్నానికి 17వ ర్యాంకు.. ఇండోర్‌కే అగ్రస్థానం

పదిలక్షలకుపైగా జనాభా ఉన్న కేటగిరిలో చోటు   

3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో గుంటూరుకు 6వ ర్యాంకు

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ ర్యాంకులు–2025’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ 13వ ర్యాంకు, విశాఖపట్నం 17వ ర్యాంకు సాధించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.  

ఎప్పటిలాగే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఏపీలోని గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈ ర్యాంకులను ప్రకటించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. – సాక్షి, న్యూఢిల్లీ

కేటగిరీల వారీగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల స్థానాలు ఇవీ.. 
కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా): 
ఈ విభాగంలో విజయవాడ 13వ ర్యాంకును, విశాఖపట్నం 17వ ర్యాంకును సాధించాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ నగరం 22వ స్థానంలో నిలిచింది.
కేటగిరీ–2 (3 నుంచి 10 లక్షల జనాభా): 
ఈ కేటగిరీలో గుంటూరు 6వ ర్యాంకుతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాజమండ్రి 12, నెల్లూరు 18, కడప 23, కర్నూలు 29, అనంతపురం 35 ర్యాంకులు పొందాయి.
కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా): 
ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయనగరం 8, శ్రీకాకుళం 16, ఒంగోలు 21, చిత్తూరు 29, ఏలూరు 31 ర్యాంకులు సాధించాయి. తెలంగాణ నుంచి నల్గొండ 13వ ర్యాంకులో, సంగారెడ్డి 17వ ర్యాంకులో నిలిచాయి.

జాతీయ స్థాయిలో విజేతలు 
10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇండోర్‌ మొదటి స్థానంలో నిలవగా, జబల్‌పూర్‌ రెండో ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఆగ్రా, సూరత్‌ మూడోస్థానంలో నిలిచాయి.  3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో అమరావతి (మహారాష్ట్ర) మొదటి ర్యాంకు సాధించగా, 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో దేవాస్‌ (మధ్యప్రదేశ్‌) అగ్రస్థానంలో నిలిచింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ నగరాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement