
సాక్షి,న్యూఢిల్లీ: వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇప్పటికే ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగుతుండగా.. మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది.రేపు ఉదయం పదిగంటలకు ప్రారంభమై.. ఐదుగంటల వరకు కొనసాగుతోంది. ఆరుగంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్లను అరికట్టేందుకు అన్నీ పార్టీల ఎంపీలు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో నిర్వహించిన మాక్ పోలింగ్ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు.
మాక్ పోలింగ్‌కు ముందే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ను పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. తమ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 11 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్‌కు సుబ్బారెడ్డి వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాధాకృష్ణన్. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది వైఎస్ జగన్ అభిమతమని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి వెల్లడించారు.