
ఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తన నివాసానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలను పీయూష్ ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్‌రెడ్డి.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.
కాగా, ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఇవాళ (మంగళవారం) ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్‌ను నిర్వహించాయి.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరుగుతోంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు.