తయారీ కేంద్రంగా భారత్‌: ప్రధాని మోదీ | PM Narendra Modi says India as a manufacturing hub | Sakshi
Sakshi News home page

తయారీ కేంద్రంగా భారత్‌: ప్రధాని మోదీ

Oct 17 2025 5:19 AM | Updated on Oct 17 2025 5:19 AM

PM Narendra Modi says India as a manufacturing hub

21వ శతాబ్దంలో ప్రపంచం చూపంతా మనపైనే.. ఈ శతాబ్దం 140 కోట్ల భారతీయులది..

కర్నూలులో ‘సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్స్‌’ సభలో ప్రధాని నరేంద్ర మోదీ  

రూ.13,400 కోట్ల అభివృద్ధి పనులతో రాయలసీమ అభివృద్ధి 

వేగవంతం.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యం 

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ పేరుతో ప్రజలు మన తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి.. ఆత్మ నిర్భర్‌ భారత్‌తో దేశాభివృద్ధికి పునాది 

కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏపీ అభివృద్ధిని విస్మరించడంతో దేశానికి నష్టం  

దేశాన్ని ముందుకు నడిపే శక్తి ఆంధ్రాకు ఉన్నా.. అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి 

ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం మారుతోంది

సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘21వ శతాబ్దం భారత్‌ది.. 140 కోట్ల మంది భారతీయులది.. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్‌ను ఓ తయారీ కేంద్రంగా చూస్తోంది.. భారత దేశ సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం గమనిస్తోంది.. దేశాభివృద్ధికి పునాది పడింది ఆత్మ నిర్భర్‌ భారత్‌తోనే.. 2047కు వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ పేరుతో ప్రజలు మన తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రతీ రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 

సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్స్‌ పేరుతో కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్డీఏ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వాహనం 16 నెలలుగా వేగంగా కదులుతోందని, డబుల్‌ ఇంజన్‌ సర్కారు వేగంగా నడుస్తోందని చెప్పారు. ఢిల్లీ, అమరావతి రెండూ వేగవంతంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నాయన్నారు. 

రోడ్లు, విద్యుత్, రైల్వే, హైవే, వాణిజ్యం, పరిశ్రమలతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి రూ.13,400 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఊతమిచ్చి ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తోందని, ఈ ప్రాజెక్టులతో కర్నూలు, పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. 2047కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లవుతుందని, అప్పటికి భారత్‌ ‘వికసిత్‌ భారత్‌’గా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..

ఇంధన రంగంలో విప్లవాత్మక అభివృద్ధి
ఏదేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. రూ.3 వేల కోట్ల విలువైన ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. దీంతో దేశ ఇంధన సామర్థ్యం పెరగబోతోంది. వేగవంతమైన అభివృద్ధి మధ్య గతాన్ని మరవొద్దు. 11 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు తలసరి విద్యుత్‌ వినియోగం (ఏటా) వెయ్యి యూనిట్లలోపు ఉండేది. అప్పుడు దేశం తరుచూ విద్యుత్‌ కోతలు, సవాళ్లు ఎదుర్కొంది. వేల గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు కూడా వేయలేని దుస్థితి. 

నేడు భారతదేశంలో క్లీన్‌ ఎనర్జీ నుంచి పూర్తి విద్యుత్‌ ఉత్పత్తి వరకూ ప్రతి రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగం 1,400 యూనిట్లకు పెరిగింది. దేశంలో ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కేంద్రం. శ్రీకాకుళం నుంచి అంగుల్‌ వరకు సహజ వాయువు పైపు లైన్‌ ప్రారంభించాం. దీంతో 15 లక్షల ఇళ్లకు గ్యాస్‌ సరఫరా అవుతోంది. చిత్తూరులో కూడా రోజుకు 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యంతో ఎల్‌పీజీ ప్రాజెక్టు నిర్మించాం. 

దీనివల్ల ప్రజలకు సేవలతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని వేగంగా సాధించే మల్టీ మోడల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాల నుంచి నగరాలు, నగరాల నుండి పోర్టుల వరకూ కనెక్టివిటీ చేశాం. విశాఖలో సబ్బవరం నుంచి షీలానగర్‌ వరకు కొత్త హైవే నిర్మాణంతో కనెక్టివిటీ మరింత మెరుగు పడుతుంది. కొత్త రైల్వే లైన్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి.

కనెక్టివిటీ హబ్‌గా విశాఖ
ఆంధ్రప్రదేశ్‌ యువత టెక్నాలజీలో చాలా ముందుంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాం. రెండు రోజుల కిందట గూగుల్‌ సంస్థ పెద్ద పెట్టుబడి ప్రకటించింది. గూగుల్‌ కంపెనీ యాజమాన్యం వారు నాతో మాట్లాడారు. ‘అమెరికా కాకుండా చాలా దేశాల్లో గూగుల్‌ పెట్టుబడులు ఉన్నాయి కానీ, అన్నింటి కంటే ఎక్కువ పెట్టుబడి ఆంధ్రలో పెడుతున్నామని చెప్పారు. 

ఈ కొత్త గూగుల్‌ ఏఐ హబ్‌లో శక్తివంతమైన ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ ఉండబోతున్నాయి. గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అంతర్జాతీయ గేట్‌వే తయారవుతోంది. అంతర్జాతీయంగా తూర్పు తీరంలోని విశాఖ నగరం కనెక్టివిటీ హబ్‌గా, ప్రపంచానికే ఏఐ హబ్‌గా మారబోతోంది.

దేశాభివృద్ధికి ఆంధ్ర.. ఆంధ్ర అభివృద్ధికి ‘సీమ’ కీలకం
దేశాభివృద్ధికి ఆంధ్ర అభివృద్ధి చాలా అవసరం. అలాగే ఆంధ్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి అంతే ముఖ్యం. కర్నూలులో ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి. రాయలసీమ అభివృద్ధికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి.  ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. 

ఆత్మ నిర్భర్‌ భారత్‌ విజన్‌ సాధించడంలో ఆంధ్ర కీలకంగా మారబోతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్‌ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టాన్ని మిగిల్చాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉంటే, ఆంధ్ర మాత్రం సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ చిత్రం మారుతోంది. నిమ్మలూరులో అడ్వాన్స్‌ నైట్‌ విజన్‌ ఫ్యాక్టరీ ప్రారంభించాం. 

మన దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర భారత్‌ సాధించడానికి ముందడుగు పడింది. ఈ ఫ్యాక్టరీ దేశ నైట్‌ విజన్‌ పరికరాలు, క్షిపణుల కోసం సెన్సార్లు, డ్రోన్‌ గార్డు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచబోతోంది. ఇక్కడ తయారయ్యే పరికరాలు భారత దేశ రక్షణ ఎగుమతులను కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయి. భారత రక్షణ రంగం శక్తి ఏంటో ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రత్యక్షంగా చూశాం.

దేశానికి డ్రోన్‌ హబ్‌గా కర్నూలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్నూలును డ్రోన్‌ హబ్‌గా చేయాలని సంకల్పించడం సంతోషం. తద్వారా వచ్చే సాంకేతికతతో కర్నూలుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక కొత్త రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఆపరేషన్‌ సింధూర్‌లో మన డ్రోన్‌లు కూడా అద్భుతాలు సృష్టించాయి. ఆ అద్భుతాలు చూసి ప్రపంచం అబ్బుర పడింది. రాబోయే రోజుల్లో కర్నూలు దేశానికి డ్రోన్‌ హబ్‌గా మారుతుంది. 

మా ప్రభుత్వ లక్ష్యం ‘సిటిజన్‌ సెంట్రిక్‌ డెవలప్‌మెంట్‌’. ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేయడం మా లక్ష్యం. దేశంలో రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి పన్నులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. తక్కువ ధరకే మందులు, మెరుగైన చికిత్స, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులతో ప్రజల జీవన విధానం సౌకర్యవంతంగా చేస్తూ కొత్త అధ్యాయాన్ని మనం ప్రారంభించాం.

ఆత్మగౌరవానికి, గొప్ప సంస్కృతికి ఏపీ నిలయం
అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి, మహానందీశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్రుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ ఆలయం మొదటిదైతే, రెండోది శ్రీశైలం. సోమనాథుడు కొలువున్న గుజరాత్‌ భూమిపై జన్మించిన నాకు కాశీ విశ్వనాథుడికి సేవ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు శ్రీశైల మల్లికార్జునుడి ఆశీస్సులు కూడా పొందాను. స్వామి దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించాను. 

ఈ వేదికపై నుంచి కూడా మరోసారి శివాజీ మహారాజ్‌కు నివాళులు అర్పిస్తున్నా. మహా శివభక్తులైన అక్క మహాదేవుళ్లను స్మరించుకుంటున్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరిసర్వోత్తమరావు లాంటి స్వాతంత్య్ర సమరయోధులకు కూడా నా నివాళులు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆత్మ గౌరవానికి, గొప్ప సంస్కృతికి, సైన్స్, పరిశోధనలకు నిలయం. ఇక్కడ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. యువతకు అపారశక్తి ఉంది. ఆంధ్రకు ఇంకా ఏదైనా అవసరం ఉందంటే అది సరైన నాయకత్వం మాత్రమే. ఇప్పుడు శక్తివంతమైన నాయకత్వం ఉంది. దీనికి తోడు ఆం్ర«ధాకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంది.

స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించండి
దసరా నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రజలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఆంధ్రలో జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్లు ఆదా అవుతోందని తెలిసింది. ఈ పొదుపుతో పండుగ సీజన్‌ ఆనందాన్ని మరింత పెంచబోతోంది. ఓకల్‌ ఫర్‌ లోకల్‌ పేరుతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని మీ అందరికీ నా అభ్యర్థన. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌తోనే వికసిత్‌ భారత్‌ కల నెరవేరుతుంది.

⇒ ఈ సభలో ఇద్దరు చిన్న పిల్లలు ఫొటోలను మోదీకి ఇవ్వాలని ప్రయత్నిస్తుండటం చూసిన మోదీ.. వాటిని తన వద్దకు చేర్చాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. సభలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్, పార్థసారథితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

భారత్‌ సూపర్‌ పవర్‌ మోదీ నాయకత్వంతోనే సాధ్యం
సూపర్‌ జీఎస్టీ–సూపర్‌ సేవింగ్స్‌తో భవిష్యత్‌లో మరిన్ని సంస్కరణలు చూడబోతున్నాం. 21వ శతాబ్ధ్దం మోదీది. దేశానికి మోదీ లాంటి నాయకుడి అవసరం చాలా ఉంది. ఇలాంటి నాయకుడిని నేను చూడలేదు. భారత్‌ ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా అవతరించాలంటే మోదీ నాయకత్వంతోనే సాధ్యం. 11 ఏళ్ల కిందట 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌.. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. 2028కి మూడో స్థానానికి వస్తాం. 2038కి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి మోదీ. 

ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ 

జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ.15 వేలు ఆదాయం కలిగింది. యు­ద్ధాలు, టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమ­యంలో మోదీ చెప్పిన స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. కేంద్రం సహకారంతో అమ­రావతిని నిలబెట్టాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. ఏపీ యంగ్‌ స్టేట్‌. ఎక్కువ పెట్టుబడులు సాధిస్తోంది. గూ­గుల్, మిట్టల్‌.. బీపీసీఎల్, సెమీ కండక్టర్‌ యూనిట్, క్వాంటమ్‌ వ్యాలీతో సత్వర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కర్నూలుకు తొందర్లోనే హైకోర్టు బెంచ్‌ వస్తుంది.  అన్ని ఎన్నికల్లో మోదీ గెలవాలి. అదే భారత్‌ విజయం.    
– చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి

కనీసం మరో 15 ఏళ్లు కూటమి నిలబడాలి
ప్రధానమంత్రిని కర్మయోగి అని పిలుస్తా. ఏ ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆలోచిస్తూ ధర్మాన్ని పట్టుకుని దేశాన్ని నడిపి­స్తున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టం. మోదీ ప్రభు­త్వాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. పుట్టే బిడ్డలకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టారు. పన్నులు ఎప్పుడూ పెరగడమే కానీ తగ్గవు. మోదీ వచ్చాక జీఎస్టీ తగ్గించారు. తద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగింది. రాష్ట్రంలో కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడాలి. సమష్టిగా పని చేయాలి.    
– పవన్‌ కళ్యాణ్, డిప్యూటీ సీఎం

ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కారు
గుజరాత్‌ను పవర్‌ ఫుల్‌ స్టేట్‌గా మార్చింది నమో. దేశాన్ని సూపర్‌ పవర్‌గా మార్చింది నమో. గతంలో ఉగ్ర దాడి జరిగితే ఇతర దేశాల సాయం అడిగే ప్రభుత్వాలు ఉండేవి. కానీ మోదీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్‌ దిమ్మ తిరిగింది. అమెరికా టాక్స్‌లు పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికి పోయాయి. కానీ మోదీ గుండె ధైర్యం ఆత్మ నిర్భర్‌ భారత్‌. ప్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. అని ధైర్యంగా నిలబడ్డారు. పేదరికం లేని దేశం నమో కల. కేంద్రంలో నమో.. రాష్ట్రంలో సీబీఎన్‌.. ఇది డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కారు. ప్రధాని మోదీ 16 నెలల్లో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర అంటే అపారమైన ప్రేమ. కోరిన కోర్కెలన్నీ తీరుస్తున్నారు.
– నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement