
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.
అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.
ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.
అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.
అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.
ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.
అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.
సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.
కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్‌లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్, పవన్లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.
అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్‌కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.