మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్‌ అవుతుందా? | KSR Comments On Chandrababu's Behavior Regarding The Attacks Of TDP Leaders In AP | Sakshi
Sakshi News home page

మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్‌ అవుతుందా?

Published Sat, Jun 8 2024 12:41 PM | Last Updated on Sat, Jun 8 2024 2:57 PM

KSR Comments On Chandrababu's Behavior Regarding The Attacks Of TDP Leaders In AP

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ గురించి చేసిన ట్వీట్ ఏ మాత్రం పద్ధతిగా ఉన్నట్లు అనిపించదు. వందల గ్రామాలు, పట్టణాలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చెలరేగి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఖండించకపోతే మానే, పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

కౌంటింగ్ జరుగుతున్న రోజే వైఎస్సార్‌సీపీ ఓడిపోతోందని తెలిసిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. గత నాలుగు రోజులుగా కత్తులు, కర్రలతో యథేచ్ఛగా తిరుగుతుంటే, ఎక్కడో ఒకటి, అరచోట తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాలలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. హింసాకాండకు ఎవరూ పాల్పడవద్దని చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఏమని అంటున్నారో చూడండి. "రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.

ఎక్కడైనా ఓడిపోయినవారు కవ్వింపు చర్యలకు దిగే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఎక్కడైనా జరిగితే వెంటనే టీడీపీ మీడియా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఉండేది కాదా! ఒకపక్క అంతగా టీడీపీ వారు చెలరేగిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలు అనడం ఏమిటి? ఆ పేరుతో దాడులు చేసుకోండని చెప్పినట్లు శ్రేణులు అర్థం చేసుకోవా! ఈ నెల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పదకుండు రాత్రివరకు ఇలాంటి దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూశారు కనుక ఈ దాడులను ఏమైనా ఆపుతారేమో చూడాలి.

టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం అంటే, వారు దాడులు చేసినప్పుడు వైఎస్సార్‌సీపీవారు ఏమైనా ప్రతిదాడికి దిగుతారేమో జాగ్రత్త అని చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాంతిభద్రతలను కాపాడాలని కోరుకున్నట్లుగా లేదు. వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్ గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి అని ఆయన అన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతలు ఏమి చేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. వైఎస్సార్‌సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి అని ఆయన సూచించారు. అంతే తప్ప టీడీపీ కార్యకర్తలు దాడులు చేయవద్దని అనడానికి ఇష్టపడడం లేదనుకోవాలి. పోలీసులు సైతం ఇంతవరకు జరిగిన హింసాకాండను వైఎస్సార్‌సీపీ వారి చర్యగానే చూడాలి తప్ప, టీడీపీ దాడులుగా చూడకూడదని అనుకునే అవకాశం కనిపించడం లేదా?

వందల చోట్ల ఈ దాడులు జరిగితే పోలీసులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇదేనా రాజ్యాంగం, చట్టబద్ధపాలన అంటే! పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ముక్తాయింపుగా చివరిలో ఒక మాట అన్నారు. అసలు ఇది ట్విటర్ లో చెప్పవలసిన విషయమా! పోలీసు డీజీపీ తదితర ఉన్నతాధికారులను పిలిచి సమీక్షించి, లేదా వారికి ఫోన్ చేసి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఏపీకి చెడ్డపేరు రాకుండా చూడాలని చెప్పవలసిన చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వచ్చే రోజులు ఇంకెంత భయానకంగా ఉంటాయో అనే సందేహం వస్తుంది.

అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు హింసాయుత చర్యలకు దిగినా తప్పే. గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై దాడులు చేస్తే అది వైఎస్సార్‌సీపీ మూకల చర్యలు అని అనుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైఎస్సార్‌సీపీవారి పనేనని టీడీపీ చెప్పేలా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశి, కొడాలి నాని, తదితరుల ఇళ్లపైకి దాడి చేసింది వైఎస్సార్‌సీపీ మూకలని చెప్పదలిచారా? ఒక పక్క టీడీపీ జెండాలతో కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు, అసాంఘీక శక్తులు స్వైర విహారం చేస్తుంటే, వైఎస్సార్‌సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డా సంయమనంగా ఉండాలని టీడీపీ వారిని కోరుతున్నానని చంద్రబాబు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. రాజ్యాంగ విధులను కాలరాయడమే.

గతంలో ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ఒక కామెంట్ ను అది కూడా ట్విటర్ లో చేసి ఊరుకున్నారు. ఇది సమంజసమేనా?  కానీ దీని గురించి ఆయనను అడిగేదెవ్వరు. ప్రశ్నిస్తానని చెబుతూ రాజకీయాలలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందంలో ఇలాంటివాటిపై కనీసం స్పందించలేకపోతున్నారు. జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను కూడా ఆయన నిరోధించడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ నేత వర్మ కారుపై జనసేన కార్యకర్తలు చేసిన దాడిని కూడా ఆయన ఖండించినట్లు అనిపించడం లేదు. ఇక లోకేష్ ఎర్రబుక్ సిద్ధం అంటూ ఆయా చోట్ల టీడీపీ వారు ప్లెక్సీలు పెడుతున్నారని కొందరు చెబుతున్నారు. అది మరింత రెచ్చగొట్టే చర్య అవుతుంది. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తే విపరిణామాలు ఎదురవుతాయి.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు జరగలేదు. అయినా హింసాకాండ అంటూ తమకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆ మీడియాలో ప్రస్తుత హింసకు సంబంధించి కథనాలేవీ ప్రముఖంగా రావడం లేదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ నేతలతో జిల్లాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. బహుశా ఆయన కూడా కొద్ది రోజులలో టీడీపీ దాడులవల్ల తీవ్రంగా గాయపడిన, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పవచ్చు.

కొద్ది మంది ఈ దాడులలో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ఓటమి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండవలసిన సమయం ఇది. ఏ పార్టీకి అయినా గెలుపు, ఓటములు ఉంటాయి. జగన్‌ అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చారనిపిస్తుంది. చంద్రబాబు కక్షలకు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ఆయన అన్నారు. చివరికి యూనివర్సిటీలలో కూడా టీడీపీ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయితే ఎవరికి చెప్పుకోవాలి.

ప్రధానమంత్రి మోదీ కూడా ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మాట్లాడే ప్రధాని ఏపీని మాత్రం విస్మరించడం బాధాకరం. ఈ హింసాకాండలో బాధితులైన కార్యకర్తలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కచ్చితంగా బాధితులకు ధైర్యం చెప్పవలసిన సమయం ఇది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశీలన చేస్తే వైఎస్సార్‌సీపీ క్యాడర్ కు నైతికబలం వస్తుంది. అలాగే రెచ్చిపోయే టీడీపీ మద్దతుదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోకపోతే ఆయన మళ్లీ 2014నాటి పాలనను పునరావృతం చేయడానికే సిద్ధపడుతున్నారన్న సంకేతాలు వెళతాయని అర్థం చేసుకోవాలి.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement