
అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తా
ఏపీలో కలలు గనే వారి సంఖ్య తక్కువేమీ కాదు
రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుంది
రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు అందిస్తోంది
పేదలు, రైతులు, యువత, మహిళాశక్తి.. ఈ నాలుగు స్తంభాలపైనే వికసిత్ భారత్ నిర్మాణం
రైతులపై భారం పడకుండా పదేళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం రూ.12 లక్షల కోట్లు వెచ్చించాం
సాక్షి, అమరావతి : ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కలిపి పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ యువకుల కలలను నిజం చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభంలో భాగంగా రూ.58 వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం ఆనందంగా ఉందన్నారు.
‘దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు. ఏపీ ఆశలకు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాది. ఈ సందర్భంగా వీరభద్రస్వామికి, అమరలింగేశ్వరస్వామికి, తిరుపతి వెంకన్న పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన ప్రధాని మోదీ మధ్యలో కొన్ని తెలుగు వాక్యాలు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
పదేళ్లుగా చేయూతనిచ్చాం...
ఇంద్రుడి రాజధాని అమరావతి.. ఏపీ రాజధాని అమరావతి. ప్రతి యువకుడి కలలు నిజమయ్యే నగరంగా అమరావతి తయారవుతోంది. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతోంది. 2015లో అమరావతికి శంకుస్థాపన చేశా. ఈ పదేళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాం. వికసిత్ ఏపీ కోసం నాడు ఎన్టీఆర్ కలగన్నారు. మనందరం కలసి అమరావతి, ఏపీని వికసిత్ భారత్ దేశానికి గ్రోత్ ఇంజన్‌గా తయారు చేయాలి.
రైలు, రోడ్డు ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు..
రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు అందిస్తోంది. దీనివల్ల ఏపీలో జిల్లాల మధ్య అనుసంధానం, పక్క రాష్ట్రాలతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు, పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తుంది. రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్య నిర్మిస్తున్న కొత్త హైవే వల్ల తిరుపతి వెంకన్నను తక్కువ సమయంలో దర్శించుకోవచ్చు.
రైల్వే బడ్జెట్‌లో ఉమ్మడి రాష్ట్రానికి రూ.900 కోట్లకు మించి కేటాయింపులుండేవి కావు. ఇప్పుడు విభజిత ఏపీకి రూ.9 వేల కోట్లకు పైగా అందిస్తున్నాం. ఏపీలో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాం. 8 సరికొత్త వందేభారత్ రైళ్లు ప్రారంభించాం. 750కిపైగా రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్‌లు నిర్మించాం. 70కిపైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ కింద అభివృద్ధి చేశాం.
నాలుగు స్తంభాలు కేంద్ర బిందువుగా
పేదలు, రైతులు, యువత, మహిళాశక్తి.. ఈ నాలుగు స్తంభాలపై వికసిత్ భారత్ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. రైతులపై భారం పడకుండా పదేళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) ద్వారా ఒక్క ఏపీలోనే సుమారు రూ.5,500 కోట్ల బీమా పరిహారం అందించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) ద్వారా రాష్ట్రంలో రైతులకు రూ.17,500 కోట్ల మేర పెట్టుబడి సాయం అందించాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందిస్తాం.
నవదుర్గా మిస్సైల్ లాంచ్ కేంద్రం..
అంతరిక్ష శక్తిగా దేశం అవతరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతీ రాకెట్ కోట్లాది మంది భారతీయులు గర్వించేలా చేస్తుంది. కోట్లాది మంది దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో డీఆర్‌డీవో నవదుర్గా మిస్సైల్ లాంచింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం కనక దుర్గమ్మలా దేశ రక్షణకు నిరంతరం శక్తిని ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఏక్తా మాల్స్ నిర్మించబోతున్నాం. ఇందులో ఒకటి విశాఖపట్నంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా హస్తకళాకారుల ఉత్పత్తులు ఒకే చోటకు తెచ్చేందుకు వీలుంటుంది.
21న విశాఖలో యోగా దినోత్సవం..
జూన్ 21న విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆరోజు ప్రపంచ ప్రజలంతా ఏపీ వైపు చూసేలా చేయాలి. అందుకోసం ఈ 50 రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో యోగాకు ప్రాముఖ్యత కల్పించేలా, వరల్డ్ రికార్డు సాధించేలా కృషి చేయాలి. ఏపీలో కలలు గనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. వాటిని నిజం చేసే వారూ తక్కువేమీ లేరు. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి పనులు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఏ స్థాయిలోకి దూసుకెళ్తుందో ఊహించగలను.
ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలబెడతాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి ఆర్కిటెక్చరల్ జోన్‌గా, కాంక్రీట్ జంగిల్‌గా మిగిలిపోకుండా జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాలనలో అమరావతి వరల్డ్ క్లాస్ రాజధానిగా ఎదుగుతుందన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను దివిసీమ ఉప్పెన మాదిరి తుడిచి పెట్టాలని చూసిందని విమర్శించారు.
అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో అమరావతిని నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.
కక్షతో నిలిపేశారు: మంత్రి లోకేశ్
సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేశారని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలం గడిపేసిందన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని అపే దమ్ము ఎవరికీ లేదన్నారు. నరేంద్ర మోదీ అనే మిస్సైల్ ఉండగా వందల పాకిస్తాన్లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరన్నారు.
మూడేళ్లలో నిర్మిస్తాం
మోదీ ఆశీస్సులతోనే అమరావతి పనులు పట్టాలెక్కించాం: సీఎం చంద్రబాబు
ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడు మోదీ
2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
సాక్షి, అమరావతి: అమరావతి పనులను మూడేళ్లలో పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త రాజధానిని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అమరావతిని నిర్మించి ప్రపంచ పటంలో నిలబెడతామన్నారు. శుక్రవారం ‘అమరావతి పునః ప్రారంభ’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2015లో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు
గత పది నెలల్లో కేంద్ర సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి పనులను పట్టాలెక్కించామన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీ సిటీగా మారుస్తామన్నారు. కేంద్రం సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఐదు కోట్ల ఆంధ్రులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారన్నారు. మోదీ నాయకత్వంలో మనదేశం ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తోందన్నారు.