
భద్రతా వలయంలోకి ఆహ్వానేతరులు
నకిలీ ఆధార్‌తో వీఐపీ పాస్‌లు
ఆత్మకూరు రూరల్: ప్రధాని నరేంద్ర మోదీ నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనలో ఆహ్వానితులు కాని ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానికి ఆహ్వానం, వీడ్కోలు పలికే సందర్భాల్లో ఎంపిక చేసిన వ్యక్తులకు వీఐపీ పాస్‌లు జారీ చేస్తారు. అయితే, సున్నిపెంటలోని హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే వ్యక్తుల జాబితాలో ఇద్దరు బీజేపీ నాయకుల స్థానంలో మరో ఇద్దరు చేరడం భద్రతా లోపాన్ని స్పష్టం చేస్తోంది.
ఆత్మకూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి, విశ్వరూపాచారి, రాష్ట్ర మైనారిటీ విభాగం ఇన్‌చార్జి షబానా, మరొకరికి ప్రధానమంత్రి శ్రీశైలం పర్యటనలో పాల్గొనేందుకు ఆహ్వానాలు వచ్చాయి. వీరందరినీ శ్రీశైలం వచ్చి సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే.. ప్రధాని పర్యటన ముందు రోజు రాత్రి ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లిన బీజేపీ నాయకులలో ముగ్గురికి మాత్రమే జిల్లా అధ్యక్షుడు పాస్‌లు పంపించి వారు సున్నిపెంటలో ప్రధాని తిరుగు ప్రయాణమైనప్పుడు హెలిప్యాడ్ వద్ద ఉండాల్సిందిగా కోరినట్టు తెలిసింది.
అయితే.. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడైన విశ్వరూపాచారికి మాత్రం పాస్ పంపలేదు. ఆయనకు మరుసటి రోజు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. మరుసటి రోజు ఉదయం విశ్వరూపాచారికి వీఐపీ పాస్ కాకుండా గ్యాలరీ పాస్ మాత్రమే పంపారు. ప్రధానికి వీడ్కోలు తెలిపే చోట హెలిప్యాడ్ వద్ద విశ్వరూపాచారి స్థానంలో శ్రీశైలానికి చెందిన బీజేపీ స్థానిక నేత చిక్కుడుచెట్టు వెంకటేశ్వర్లు ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు తూము శివారెడ్డి స్థానంలో బీజేపీ నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు డ్రైవర్ బాలు కనిపించాడు.

ఇలా ఎంతమంది మరొకరి పేరుతో వీఐపీల కోటాలో ప్రధాని భద్రతా వలయంలోకి చేరారోనన్న అనుమానం కలుగుతోంది. ప్రధానికి వీడ్కోలు తెలిపేందుకు ఎంపికైన నాయకుల జాబితాలో తూము శివారెడ్డి సంఖ్య 10 కాగా.. విశ్వరూపాచారి సంఖ్య 12. జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నప్పటికీ పాస్‌లు వేరే వారు తీసుకుని రావడంపై దర్యాప్తు జరపాలని పలువురు కోరుతున్నారు. పాస్‌లను మార్చేందుకు ఆధార్‌ను టాంపరింగ్ చేసి ఫొటోలు మార్చి ఉంటారనే అనుమానం కలుగుతోంది.