
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు
శ్రీశైలం టెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. కర్నూలు నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో కలిసి సున్నిపెంట హెలిప్యాడ్‌కు.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలానికి చేరుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు విచ్చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లకు ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి విభూతి, తిలకధారణ చేశారు.
దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్‌లాల్ పూలమాలలు వేసి స్వాగతం పలకగా.. స్వామి అమ్మవార్ల ఆలయాల ప్రధానార్చకులు వీరన్నస్వామి, వై. విజయకుమార్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి ప్రధాని నమస్కరించారు. రత్నగర్భ గణపతి ఆలయం వద్ద గణపతి పూజ నిర్వహించారు. అనంతరం.. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళహారతి, నిర్వహించుకున్నారు. నందీశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.
అర్చకులు ప్రధానికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత మోదీ మల్లికాగుండం వద్ద స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. భ్రమరాంబాదేవి ఆలయ ముఖమండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడశోపచార పూజ ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన మండపంలో ప్రధాని మోదీకి వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, శేషవ్రస్తాలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ అందజేసి సత్కరించారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రంలో..
ఇక ఆలయం నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్న ప్రధాని మోదీ శివాజీ దర్బార్‌హాల్‌ను సందర్శించారు. ఈ కేంద్రం నిర్వాహకులు నాగేశ్వరరావు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర విశేషాలు, జైత్రయాత్రలు, శివాజీ శ్రీశైలానికి వచ్చిన తీరును, ధ్యానం చేయగా అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహూకరించిన విషయాన్ని ప్రధానికి వివరించారు.
శివాజీ దర్బార్‌హాల్‌లో త్రీడి ఛాయాచిత్రాల్లో శివాజీ జీవితచర్రిత విశేషాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. అనంతరం.. శివాజీ ధ్యానమందిరాన్ని సందర్శించారు. అక్కడి నుంచి అతిథిగృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని రోడ్డుమార్గంలో సున్నిò³ంట చేరుకుని హెలికాప్టర్‌లో కర్నూలుకు తిరుగు పయనమయ్యారు.