సాక్షి,కృష్ణా: కృష్ణానదిలో మరోసారి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల పడవ మార్గ మధ్యలో సాంకేతిక లోపం కారణంగా నదిలో ఆగిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ప్రయాణం మధ్యలో పడవ ఇంజిన్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దీంతో పడవ నది ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయింది. ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. అయితే, పడవలో ఉన్న సిబ్బంది వెంటనే లంగర్ వేసి పడవను నిలిపే ప్రయత్నం చేశారు.
గింజపల్లి ఒడ్డున ఉన్న స్థానిక గ్రామస్తులు అప్రమత్తమై పడవను తాడులతో ఒడ్డుకు లాగారు. వారి సహకారంతో పడవను సురక్షితంగా తీరం చేరవేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. ప్రమాద సమయంలో పడవలో ఉన్న 30 మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిలో కొందరికి స్వల్ప అస్వస్థతలు తప్ప, ఎటువంటి గాయాలు సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


