తజ్మీన్‌ బ్రిట్స్‌ మెరుపు సెంచరీ | South Africa defeats Netherlands in Womens T20 World Cup | Sakshi
Sakshi News home page

తజ్మీన్‌ బ్రిట్స్‌ మెరుపు సెంచరీ

Jun 27 2026 3:22 AM | Updated on Jun 27 2026 3:22 AM

South Africa defeats Netherlands in Womens T20 World Cup

69 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 నాటౌట్‌

నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం

మహిళల టి20 ప్రపంచకప్‌ టోర్నీ

బ్రిస్టల్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారీ విజయం నమోదు చేసుకుంది. సెమీఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సఫారీ జట్టు సమష్టిగా సత్తా చాటి రన్‌రేట్‌ను మెరుగు పరుచుకుంది. గ్రూప్‌–1లో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో దక్షిణాఫ్రికా 88 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా జట్టు... ఆ తర్వాత వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 208 పరుగులు చేసింది. టి20ల్లో దక్షిణాఫ్రికాకు ఇది రెండో అత్యధిక స్కోరు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తజ్మీన్‌ బ్రిట్స్‌ (69 బంతుల్లో 114 నాటౌట్‌; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో అదరగొట్టింది. కెప్టెన్‌ లౌరా వోల్వార్ట్‌ (36 బంతుల్లో 45; 6 ఫోర్లు), అనేరియా డెర్క్‌సెన్‌ (16 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. గ్రూప్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు... రన్‌రేట్‌ను మెరుగు పరుచుకోవాలనే లక్ష్యంతో ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.

బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్‌లతో రెచ్చిపోయిన బ్రిట్స్‌... వోల్వార్ట్‌తో కలిసి తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించింది. ఈ క్రమంలో 36 బంతుల్లో అర్ధశతకంతో పూర్తి చేసుకున్న బ్రిట్స్‌... 63 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకుంది. టి20ల్లో ఆమెకు ఇదే తొలి శతకం. ఆఖర్లో డెర్క్‌సెన్‌ మెరుపులతో సఫారీ జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. కొండంత లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులకు పరిమితమైంది. 

మొల్కెన్‌బోర్‌ (41 బంతుల్లో 41; 4 ఫోర్లు), సాన్యా ఖురానా (30 బంతుల్లో 36; 6 ఫోర్లు) కాస్త పోరాడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. గ్రూప్‌లో 4 మ్యాచ్‌లాడి 3 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న దక్షిణాఫ్రికా (0.734 రన్‌రేట్‌) పట్టికలో మూడో స్థానంలో ఉంది. భారత జట్టు కూడా 6 పాయింట్లతోనే ఉన్నా రన్‌రేట్‌ (2.268)లో మెరుగ్గా ఉండటంతో రెండో స్థానం దక్కించుకుంది. దక్షిణాఫ్రికా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement