source: X
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి (అక్టోబర్ 9) మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. డర్బన్ వేదికగా జరిగే తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ పేసర్ కగిసో రబాడకు చోటు దక్కలేదు. గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రబాడ స్థానంలో అన్రిచ్ నోర్జే తుది జట్టులోకి వచ్చాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నోర్జే టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నాడు. చివరిసారిగా అతడు 2023 ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు.
జట్టు ఆర్డర్ విషయానికొస్తే.. మార్క్రమ్, రికెల్టన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. వియాన్ మల్డర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ముల్దర్ ఈ స్థానంలో వచ్చి జింబాబ్వేపై అజేయ 367 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
కెప్టెన్ టెంబా బవుమా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ సాధించిన బవుమా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. టెస్టు జట్టులో తన స్థానాన్ని ఇంకా సుస్థిరం చేసుకోని స్టబ్స్‌కు ఈ సిరీస్ కీలకం కానుంది.
డేవిడ్ బెడింగ్‌హామ్ ఆరో స్థానంలో, కైల్ వెర్రిన్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. రికెల్టన్ వికెట్‌కీపింగ్ చేయనుండటంతో వెర్రిన్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగుతాడు. ఇక ఎనిమిదో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ బరిలోకి దిగుతాడు.
డర్బన్ పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంది. కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. వీరిద్దరు తొమ్మిది, పది స్థానాల్లో బరిలోకి దిగుతారు. 11వ నంబర్‌లో స్పెషలిస్ట్ పేసర్ నోర్జే బరిలో ఉంటాడు. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించాల్సి ఉంది.
ఆసీస్‌తో తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా తుది జట్టు
ఎయిడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), వియాన్ మల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్కో యాన్సెన్, అన్రిచ్ నోర్జే, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్
ఇదీ చదవండి: నవంబర్ 8న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్


