5 వికెట్లతో మెరిసిన భారత పేసర్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 ఆలౌట్
రాణించిన సిరాజ్, కుల్దీప్
తొలి రోజు టీమిండియాదే ఆధిపత్యం
కోల్‌కతా: పిచ్ ఎలా ఉన్నా... చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తే... వికెట్లు రావడం కష్టమేమీ కాదని భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన భారత కెప్టన్ శుబ్‌మన్ గిల్ ఏకంగా నలుగురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లకు పెద్దగా పని లేకుండా చేశాడు.
బుమ్రా పేస్‌కు తోడు మరో పేసర్ సిరాజ్ కూడా మెరిపించడం... ఎడంచేతి వాటం స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ వంతుగా రాణించడం... వెరసి భారత జట్టుతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజే దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.
ఓపెనర్లు మార్క్‌రమ్ (48 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించినట్టే అనిపించింది. అయితే ఒక్కసారి బుమ్రా దెబ్బకు అంతా తారుమారైంది. ఐదు పరుగుల వ్యవధిలో మార్క్‌రమ్, రికెల్టన్‌లను బుమ్రా పెవిలియన్‌కు పంపించగా... కెపె్టన్ బవూమా (3)ను కుల్దీప్ అవుట్ చేశాడు. దాంతో 57/0తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా 71/3తో కష్టాల్లో పడింది.
ఆ తర్వాత ముల్డర్ (51 బంతుల్లో 24; 3 ఫోర్లు), టోనీ జోర్జి (55 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) నింపాదిగా ఆడి వికెట్ల పతనాన్ని నిలువరించారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 43 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో కుల్దీప్, బుమ్రా మళ్లీ మెరిశారు. ముల్డర్‌ను కుల్దీప్... జోర్జిని బుమ్రా అవుట్ చేశారు. దాంతో దక్షిణాఫ్రికా 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
ట్రిస్టన్ స్టబ్స్ (74 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), వెరీన్ (36 బంతుల్లో 16; 2 ఫోర్లు) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా... వెరీన్‌ను సిరాజ్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికాకు దెబ్బ పడింది. చివరి ఐదు వికెట్లను దక్షిణాఫ్రికా 13 పరుగుల వ్యవధిలో కోల్పోయి చివరకు 159 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్ కూడా బ్యాటింగ్‌కు ఇబ్బంది పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లు ఆడి ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు సాధించింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) పంత్ (బి) బుమ్రా 31; రికెల్టన్ (బి) బుమ్రా 23; ముల్డర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 24; బవుమా (సి) జురేల్ (బి) కుల్దీప్ 3; టోనీ జోర్జి (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 24; స్టబ్స్ (నాటౌట్) 15; వెరీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 16; మార్కో యాన్సెన్ (బి) సిరాజ్ 0; కార్బిన్ బాష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 3; హార్మెర్ (బి) బుమ్రా 5; కేశవ్ మహరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (55 ఓవర్లలో ఆలౌట్) 159; వికెట్ల పతనం: 1–57, 2–62, 3–71, 4–114, 5–120, 6–146, 7–147, 8–154, 9–159, 10–159. బౌలింగ్: బుమ్రా 14–5–27–5, సిరాజ్ 12–0–47–2, అక్షర్ పటేల్ 6–2–21–1, కుల్దీప్ యాదవ్ 14–1–36–2, రవీంద్ర జడేజా 8–2–13–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0.
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) మార్కో యాన్సెన్ 12; కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 13; వాషింగ్టన్ సుందర్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 37. వికెట్ల పతనం: 1–18, బౌలింగ్: మార్కో యాన్సెన్ 6–2–11–1, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 5–1–8–0, కార్బిన్ బాష్ 3–2–1–0, హార్మెర్ 1–1–0–0.
2012
భారత జట్టు చివరిసారి 2012లో ఒకే టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించింది. నాగ్‌పూర్ వేదికగా 2012 డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లో భారత్ తరఫున నలుగురు స్పిన్నర్లు అశి్వన్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా, ప్రజ్ఞాన్ ఓజా బరిలోకి దిగారు. ఇదే మ్యాచ్‌తో జడేజా టెస్టుల్లో అరంగేట్రం చేయగా... ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేయడం విశేషం.


