భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టుకు దాదాపు ఎనిమిది నెలలగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. షమీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం మొండి చేయి చూపిస్తోంది.
ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ చివరసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు ఆసియాకప్, వెస్టిండీస్‌తో టెస్టులకు షమీని సెలక్టర్లు పక్కన పెట్టారు. కనీసం స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కైనా షమీని ఎంపిక చేస్తారని భావించారు.
కానీ మరోసారి అగార్కర్ అండ్ కో షమీకి మొండి చేయి చూపించారు. తను ఫిట్‌గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ అగార్కర్‌ను షమీ పరోక్షంగా విమర్శించాడు. ఈ నేపథ్యంలో షమీకి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. షమీ భారత జట్టు తరపున తిరిగి అన్ని ఫార్మాట్లలో ఆడాలని తన ఆశిస్తున్నట్లు దాదా తెలిపాడు.
"మహ్మద్ షమీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో బెంగాల్‌ను అతడు ఒంటి చేత్తో గెలిపించాడు. అతడి ప్రదర్శలను సెలక్టర్లు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే షమీతో సెలక్టర్లు మాట్లాడి ఉంటారు.
ఫిట్‌నెస్ గానీ, స్కిల్ విషయంలో గానీ షమీ ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి అతడిని టెస్ట్‌లు, వన్డేలు, టీ20లు అన్నింటిలోనూ భారత్ తరపున కొనసాగించాలి" అని ఓ కార్యక్రమంలో గంగూలీ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత రంజీ సీజన్‌లో షమీ 91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు సాధించాడు. కాగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోల్‌కతా వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.


