ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు దశాబ్దన్నరం తర్వాత ఇంగ్లండ్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచింది. పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి గెలుపు జెండా ఎగురవేసింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
గెలుపు బోణీ
ఆతిథ్య ఆసీస్ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించి.. గెలుపు బోణీ కొట్టింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన ఇంగ్లండ్ హ్యాట్రిక్ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన కంగారూలు యాషెస్ సిరీస్‌ను మరోసారి కైవసం చేసుకోగా.. స్టోక్స్ బృందం తీవ్ర విమర్శలపాలైంది.
ముఖ్యంగా.. బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతో మూల్యం చెల్లించేలా చేసిన హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ ప్రసిద్ధ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నాలుగో టెస్టులో బరిలో దిగింది ఇంగ్లండ్.
బౌలర్లదే పైచేయి
శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పచ్చటి పిచ్ పేసర్లకు అనుకూలించిన తరుణంలో ఆసీస్ బౌలర్లు సైతం చెలరేగిపోయారు. ఇంగ్లండ్‌ను 110 పరుగులకే కుప్పకూల్చారు.
ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయారు. ఈసారి 132 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా ఇంగ్లండ్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగారు. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పొరపాట్లకు తావివ్వలేదు.
ఆచితూచి ఆడుతూనే తమదైన శైలిలో టార్గెట్ పూర్తి చేసింది. ఆరు వికెట్లు నష్టపోపయి 178 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ చివరగా 2010లో టెస్టు మ్యాచ్ గెలిచింది.
ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..
ఇక ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఆస్ట్రేలియాలో ఇదే యాషెస్ తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇంతటి ప్రత్యేక మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లతో చెలరేగిన జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?


