#Rashid Khan: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్‌!

SL Vs AFG ODI Series: Rashid Out Of 1st 2 Matches With Lower Back Injury - Sakshi

SL Vs AFG ODI Series- Rashid Khan: శ్రీలంకతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా పక్కకు తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ధ్రువీకరించింది. 

కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు అఫ్గన్‌ శ్రీలంకలో పర్యటించనుంది. జూన్‌ 2, 4,7 తేదీల్లో సిరీస్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. హంబన్‌టోటాలోని మహీంద రాజపక్స స్టేడియంలోనే మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌
ఈ నేపథ్యంలో మే 15న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది అఫ్గన్‌ బోర్డు. హష్మతుల్లా షాహిది సారథ్యం వహించనున్న జట్టులో రషీద్‌ ఖాన్‌కు చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023 ఫైనల్‌ కారణంగా ఈ స్టార్‌ స్పిన్‌ బౌలర్‌ ఆలస్యంగా జట్టుతో చేరనున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా అతడు మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైనట్లు బోర్డు తాజాగా వెల్లడించింది. ‘‘రషీద్‌ ఖాన్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు. జూన్‌ 7 నాటి ఫైనల్‌ వన్డేకు అతడు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నాం’’ అని తెలిపింది.

గుజరాత్‌కు భంగపాటు
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రషీద్‌ ఖాన్‌ 17 మ్యాచ్‌లు ఆడి 8.23 ఎకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్‌ ఝులిపించి గుజరాత్‌ను ఫైనల్‌ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వైస్‌ కెప్టెన్‌.

అయితే, అనూహ్య పరిస్థితుల నడుమ రిజర్వ్‌డే(మే 29) జరిగిన ఐపీఎల్‌-2023 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తద్వారా వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలన్న టైటాన్స్‌పై ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 

అత్యధిక వికెట్ల వీరులు
ఇక రషీద్‌ అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మూడో స్థానంతో సరిపెట్టుకోగా.. అతడి సహచర బౌలర్లలో మహ్మద్‌ షమీ(28 వికెట్లు)  పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకోగా.. మోహిత్‌ శర్మ (8.17 ఎకానమీతో 27 వికెట్లు) రెండో స్థానంలో నిలిచాడు. 

రషీద్‌ లేకున్నా
కాగా శ్రీలంకతో మొదటి రెండు వన్డేలకు రషీద్‌ దూరమైనప్పటికీ మహ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌లతో స్పిన్‌ విభాగం కాస్త పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక నూర్‌ అహ్మద్‌ సైతం ఐపీఎల్‌ తాజా సీజన్‌లో గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అతడు 13 మ్యాచ్‌లు ఆడి 7.82 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అఫ్గన్‌ జట్టు:
హష్మతుల్లా షాహిది (కెప్టెన్‌), రహ్మత్ షా (వైస్‌ కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖాయిల్ (వికెట్‌ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్‌ అహ్మద్‌, అబ్దుల్‌ రెహమాన్, ఫజల్ హక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.

రిజర్వ్‌ ప్లేయర్లు: గుల్బాదిన్ నాయబ్, షాహిదుల్లా కమల్, యామిన్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రెహమాన్ అక్బర్.
చదవండి: #MS Dhoni: ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే
సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్‌ స్టార్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top