
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–సెమ్ వెర్‌బీక్ (నెదర్లాండ్స్) జోడీ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–వెర్‌బీక్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/3)తో లూసియా స్టెఫానీ (బ్రెజిల్)–జో సాలిస్‌బరీ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సినియకోవా–వెర్‌బీక్ జంటకు 6,80,000 పౌండ్లు (రూ. 7 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
సినియకోవా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌కాగా... ‘మిక్స్‌డ్’లో మాత్రం తొలి టైటిల్. మహిళల డబుల్స్‌లో సినియకోవా మూడుసార్లు చొప్పున ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో... ఒకసారి యూఎస్ ఓపెన్‌లో టైటిల్స్ సాధించింది. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్‌లో... పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మరోవైపు వెర్‌బీక్ తొలి గాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాడు.