
సింగిల్స్‌లో ఎంతటి మేటి క్రీడాకారులైనా... డబుల్స్ విభాగంలో రాణించాలంటే మాత్రం విశేష ప్రతిభ, చక్కటి సమన్వయం ఉండాలని సారా ఎరాని–ఆండ్రియా వవసోరి (ఇటలీ) నిరూపించారు. మ్యాచ్‌లను, టోర్నీని కొత్త ఫార్మాట్‌లో నిర్వహించినా... సింగిల్స్ స్టార్స్‌ను బరిలోకి దించినా... డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడారు.
టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ ‘మిక్స్‌డ్ డబుల్స్’ విభాగంలో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ‘సూపర్ టైబ్రేక్’లో పైచేయి సాధించిన సారా ఎరాని–వవసోరి ద్వయం ‘మిక్స్‌డ్ డబుల్స్’ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు.
న్యూయార్క్: కొత్త ఫార్మాట్‌కు ఆహ్వానం పలికి... డబుల్స్ స్పెషలిస్ట్ అవకాశాలను దెబ్బ తీశారని నిర్వాహకులను విమర్శించినా... మరోవైపు తమ సహజ నైపుణ్య ప్రదర్శనతో సారా ఎరాని–ఆండ్రియా వవసోరి జోడీ అదరగొట్టింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఈ ఇటలీ జంట వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచింది. గురువారం ఉదయం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స్ సారా ఎరాని–వవసోరి 6–3, 5–7, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)–కాస్పర్ రూడ్ (నార్వే)లపై గెలుపొందారు.
92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఎరాని–వవసోరి నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. విజేతగా నిలిచిన ఎరాని–వవసోరిలకు 10 లక్షల డాలర్లు (రూ. 8 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ స్వియాటెక్–రూడ్‌లకు 4 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 50 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రెండు రోజుల్లోనే ముగిసిన మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఎరాని–వవసోరి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
గురువారమే జరిగిన సెమీఫైనల్స్‌లో ఎరాని–వవసోరి 4–2, 4–2తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా)లను ఓడించింది. మరో సెమీఫైనల్లో స్వియాటెక్–రూడ్ 3–5, 5–3, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)–జాక్ డ్రేపర్ (బ్రిటన్)లపై గెలిచారు. 2018, 2019లలో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ వరుసగా రెండేళ్లు ‘మిక్స్‌డ్ డబుల్స్’ టైటిల్ నెగ్గగా... ఇప్పుడు ఎరాని–వవసోరి ఈ ఘనత సాధించారు.