పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ... మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా... మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం థామ్ గికెల్–డెలై్ఫన్ డెల్‌ర్యూ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట 23–21, 8–21, 17–21తో పోరాడి ఓడిపోయింది.
75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రుత్విక–రోహన్ తొలి గేమ్‌ను దక్కించుకున్నా... రెండో గేమ్‌లో తడబడ్డారు. నిర్ణాయక మూడో గేమ్‌లో రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు తీవ్రంగా పోరాడాయి. ఒకదశలో రుత్విక–రోహన్ 17–15తో రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. కానీ గికెల్–డెల్‌ర్యూ ద్వయం ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన రుత్విక–రోహన్ జంటకు 3,087 డాలర్ల (రూ. 2 లక్షల 71 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,320 పాయింట్లు లభించాయి.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉన్నతి హుడా 14–21, 11–21తో రెండో ర్యాంకర్ వాంగ్ జియి (చైనా) చేతిలో ఓడిపోయింది. ఉన్నతి ఖాతాలో 2,850 డాలర్ల (రూ. 2 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,320 పాయింట్లు చేరాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కవిప్రియ–సిమ్రన్ ద్వయం 7–21, 9–21తో మూడో ర్యాంక్ జోడీ కిమ్ హై జియోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. కవిప్రియ–సిమ్రన్ జోడీకి 3,087 డాలర్ల (రూ. 2 లక్షల 71 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,320 పాయింట్లు లభించాయి.


