 
													పోరాడి ఓడిన శ్రియాన్షి
కిరణ్ జార్జి, లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి ముందంజ
సార్‌బ్రుకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–18, 21–13తో జొనాథన్ బింగ్–క్రిస్టల్ లాయ్ (కెనడా) జంటపై విజయం సాధించింది. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రుత్విక–రోహన్‌లకు తొలి గేమ్‌లో కాస్త పోటీ లభించినా... రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది.
మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 21–19, 8–21, 13–21తో భారత్‌కే చెందిన రక్షితశ్రీ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌తోపాటు కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్య సేన్ 21–14, 21–11తో భారత్‌కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై గెలుపొందగా... కిరణ్ జార్జి 18–21, 21–18, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. మరో మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21–11, 21–11తో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్‌యె (సింగపూర్)కు షాక్ ఇచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన తరుణ్ మన్నేపల్లి తొలి రౌండ్‌లోనే ని్రష్కమించాడు. తరుణ్ 11–21, 12–1తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
