ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదుగురు భారత షట్లర్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సహా లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, ఆయుశ్ శెట్టి విజయాలు సాధించారు. తరుణ్ 21–13, 17–21, 21–19తో మాగ్నస్ జాన్‌సెన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. 66 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తరుణ్ తన షాట్‌లతో ఆకట్టుకున్నాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ లిన్ చున్ యీ (చైనీస్ తైపీ)తో తరుణ్ ఆడతాడు. ఇతర మ్యాచ్‌ల్లో లక్ష్యసేన్ 21–17, 21–13తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ)పై, ప్రణయ్ 6–21, 21–12, 21–17తో యొహానెస్ సౌట్ మార్సెల్లినో (ఇండోనేసియా)పై విజయాలు సాధించారు. ప్రపంచ 85వ ర్యాంకర్‌తో పోరులో తొలి గేమ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ప్రణయ్ ఆ తర్వాత కోలుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
ఆయుశ్ శెట్టి 21–11, 21–15తో సామ్ యువాన్ (కెనడా)పై, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21–19, 19–21, 21–15తో లీ చియా హావ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జ్ 21–11, 22–24, 17–21తో ఆరో సీడ్ కెంటా నిషిమొటో (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్ జగ్లాన్–లక్షిత జగ్లాన్ జంట 12–21, 16–21తో నైల్ యాకురా–క్రిస్టల్ లై (కెనడా) ద్వయం చేతిలో ఓడింది.


