
హాంకాంగ్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 18–21, 21–10తో చియు సియాంగ్ చియె–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిరణ్ జార్జి (భారత్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.
క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జి 21–14, 21–13తో చియెమ్ జూన్ వె (మలేసియా)పై, 21–18, 21–14తో శంకర్ ముత్తుస్వామి (భారత్)లపై గెలుపొందాడు. మరోవైపు హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో తరుణ్ 28–26, 21–13తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి... రెండో రౌండ్‌లో 23–21, 13–21, 18–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు.