
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్
న్యూయార్క్: సింగిల్స్‌లో మేటి క్రీడాకారులుగా ఉన్న వారిని జోడీలుగా మార్చి... మిక్స్‌డ్ డబుల్స్ ఆడించాలని యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం అంతగా సక్సెస్ కాలేదు. స్టార్ ఆటగాళ్లతో నిర్వహించిన మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో అనూహ్య ఫలితాలు వచ్చాయి.
సెర్బియా దిగ్గజం, ప్రపంచ ఏడో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్... ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)... ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మిక్స్‌డ్ డబుల్స్‌లో తమ తొలి మ్యాచ్‌లలోనే పరాజయం పాందగా... ప్రపంచ ఆరో ర్యాంకర్ బెన్ షెల్టన్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు.
జొకోవిచ్–డానిలోవిచ్ (సెర్బియా) జంట 2–4, 3–5తో మెద్వెదెవ్–మిరా ఆండ్రీవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. అల్‌కరాజ్ (స్పెయిన్)–ఎమ్మా రాడుకాను (బ్రిటన్) జంట 2–4, 2–4తో జెస్సికా పెగూలా (అమెరికా)–జేక్ డ్రేపర్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. జ్వెరెవ్–బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) ద్వయం 0–4, 3–5తో డానియెలా కొలిన్స్–క్రిస్టియన్ హారిసన్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.
క్వార్టర్ ఫైనల్లో పెగూలా–డ్రేపర్ ద్వయం 4–1, 4–1తో మెద్వెదెవ్–ఆండ్రీవా జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో కొలిన్స్–హారిసన్ జోడీ 4–1, 5–4 (7/2)తో టేలర్ టౌన్‌సెండ్–బెన్ షెల్టన్ (అమెరికా) ద్వయంపై నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.