శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌ | Shubman Gill Scores 10th Test Century, Matches Virat Kohli’s Calendar-Year Record | Sakshi
Sakshi News home page

శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌

Oct 11 2025 1:01 PM | Updated on Oct 11 2025 1:27 PM

Shubman Gill Slams 10th Test Century Equals  Kohli Ultimate Feat

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.

ఆరునెలలు తిరిగే లోపే
అంతేకాదు.. ఈ ఏడాది గిల్‌కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్‌గా గిల్‌.. విరాట్‌ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. 2017, 2018లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి ఆరునెలలు తిరిగే లోపే గిల్‌ ఈ ఫీట్‌ సాధించడం మరో విశేషం.

ఇంగ్లండ్‌ పర్యటనలో నాలుగు
కాగా జూన్‌లో ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో.. అతడి స్థానంలో గిల్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లో భాగంగా గిల్‌ నాలుగు శతకాలు బాదాడు.

అంతేకాదు ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 269 పరుగులు సాధించి.. ఈ వేదిక మీద డబుల్‌ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతోంది.

ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో తొలి టెస్టు జరుగగా.. భారత్‌.. విండీస్‌ను ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనంతరం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 

తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌
తొలిరోజు రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన భారత జట్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఉన్న వేళ డిక్లేర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. గిల్‌ 196 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. 

మిగిలిన వాళ్లలో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (175) భారీ శతకం సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (87) గొప్పగా రాణించాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 38, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌రెడ్డి 43, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ 44 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ జొమెల్‌ వారికన్‌ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్‌.. తప్పు నీదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement