
ఐపీఎల్-2025 సీజన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో అయ్యర్ ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడేందుకు తను సిద్దంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు శ్రేయస్ అయ్యర్ తెలియజేసినట్లు సమాచారం.
ఈ దేశవాళీ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అయ్యర్ వెస్ట్‌జోన్ తరపున ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో పాటు టీమిండియా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబేలు కూడా దులీప్ ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న సెమీస్‌లో క్వార్టర్ ఫైనల్ విజేతతో వెస్ట్‌జోన్ తలపడనుంది.
ఇక ఇది ఇలా ఉండగా.. వైట్‌బాల్ క్రికెట్‌లో తనను తను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్ ఇంకా టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. భారత తరపున ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన అయ్యర్.. 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు.
అయితే డిమాస్టిక్ క్రికెట్‌లో మాత్రం అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో కూడా ఈ ముంబైకర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్‌తో టెస్టులకు ఎంపిక చేస్తారని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అతడికి ప్రస్తుతం జట్టులో
అయ్యర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి.. టెస్టు జట్టులో అతడికి ఛాన్స్ ఇచ్చేందుకు అవకాశం లేదని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే ఇంకా మెరుగ్గా రాణించి టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా అయ్యర్ ముందుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్ భారత తరపున చివరగా గతేడాది ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు.
చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్