
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలలో "పవర్ కపుల్ పేరొందిన ఈ జంట ఒక్కసారిగా విడిపోయి అందరికి షాకిచ్చారు. సరిగ్గా ఇదంతా చాహల్ భారత జట్టుకు దూరమైన సమయంలోనే జరిగింది.
దీంతో చాహల్ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే ధనశ్రీ నుంచి విడాకులు తీసుకోవడంపై చాహల్ తాజాగా స్పందించాడు. విడాకులు తర్వాత వచ్చిన తప్పుడు ఆరోపణలు తనను ఎంతోగానే బాధించాయని చహల్ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
"విడాకుల సమయంలో నాపై ఎన్నో నిరాధరమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో నేను మానసికంగా కుంగిపోయాను. ఇక ఈ జీవితం చాలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. గంటలు తరబడి ఏడ్చేవాడిని. దాదాపు 40 నుంచి 45 రోజుల పాటు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయాను. నాకు ఇష్టమైన క్రికెట్‌పై ఏకాగ్రత పెట్టలేకపోయాను. నా స్నేహితుడితో ఆత్మహత్య ఆలోచనలను పంచుకునేవాడిని. చాలా భయపడ్డాను. అందుకే కొద్ది రోజులు క్రికెట్‌కు దూరంగా ఉన్నాను.
నేను ఎప్పుడూ మోసం చేయలేదు..
"ధనశ్రీతో విడాకులు తీసున్నాక చాలామంది మోసగాడిగా అభివర్ణించారు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తి తనకు దొరకడు. సోదరీమణులు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వారితో కలిసి పెరిగాను. కాబట్టి మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు.
నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. నా పేరును ఇతరులతో లింక్ చేసి చాలా కథనాలు రాశారు. కేవలం వ్యూస్ కోసం అలా చేశారు" అని రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో జరిగిన ఇంటర్య్వూలో చాహల్ పేర్కొన్నాడు. కాగా చాహల్-ధనశ్రీ వర్మలు 22 డిసెంబర్ 2020న ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరికి ముంబైలోని బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసింది. చాహల్ ప్రస్తుతం ఆర్జే మహ్వాష్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
చదవండి: #Karun Nair: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు