భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమైన రవి బిష్ణోయ్‌కు ఊహించని ఆఫర్ వచ్చింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ఎంపికైన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడటంతో వారి స్థానాలు భర్తీ చేసే సువర్ణావకాశం వీరికి దక్కింది. శ్రేయస్, బిష్ణోయ్‌ను న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
జనవరి 21, 23, 25 తేదీల్లో జరగబోయే తొలి మూడు మ్యాచ్‌ల్లో శ్రేయస్ తిలక్ వర్మ స్థానంలో ఆడనున్నారు. తిలక్ ఐదు మ్యాచ్‌ల న్యూజిలాండ్ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు మాత్రమే దూరమైన విషయం తెలిసిందే. బిష్ణోయ్ మాత్రం సిరీస్ మొత్తానికి సుందర్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఉంటాడు. వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన సుందర్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్‌లో పాల్గొనేది కూడా అనుమానమేనని తెలుస్తుంది.
సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. సుందర్‌కు స్కాన్స్‌లో సైడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ అని తేలింది. దీంతో అతనికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఒకవేళ అతను త్వరగా కోలుకుంటే ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది.
శ్రేయస్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2023 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో ఆడారు. ఆతర్వాత అతను క్రమంగా టీమిండియా టీ20 సర్కిల్స్ నుంచి మాయమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్‌లో అత్యుత్తమంగా రాణించడంతో శ్రేయస్‌కు భారత టీ20 జట్టులో స్థానం కల్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు తిలక్ గాయపడటంతో అతనికి ఊహించని విధంగా భారత టీ20 బెర్త్ దక్కింది.
ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్‌తో మొదటి మూడు టీ20ల్లో రాణిస్తే, ఆ సిరీస్ మొత్తానికి కొనసాగించడంతో పాటు ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. శ్రేయస్ గత ఐపీఎల్‌లో 175.07 స్ట్రయిక్‌రేట్‌తో 604 పరుగులతో సత్తా చాటడంతో, తన జట్టు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఫైనల్స్‌కు కూడా చేర్చాడు.
రవి బిష్ణోయ్ విషయానికి వస్తే.. ఈ కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ చివరిగా 2025 జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆతర్వాత వరుణ్ చక్రవర్తి కారణంగా అతనికి అవకాశాలు రాలేదు. వరుణ్ దాదాపు ప్రతి మ్యాచ్‌లో రాణిస్తూ భారత స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానాన్ని కబ్జా చేశాడు. దీంతో బిష్ణోయ్‌కు అవకాశాలు రాలేదు.
తాజాగా వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో బిష్ణోయ్‌కు ఊహించని అవకాశం దక్కింది. తొలుత సుందర్ స్థానాన్ని మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌తో భర్తీ చేస్తారని అంతా అనుకున్నారు. రియాన్ పరాగ్ పేరు పరిశీలనలో కూడా ఉండింది. అయితే ఊహించని విధంగా భారత సెలెక్టర్లు స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన బిష్ణోయ్‌కు అవకాశం కల్పించారు. బిష్ణోయ్ ఇప్పటివరకు భారత్ తరఫున 42 టీ20ల్లో 61 వికెట్లు తీశాడు.
న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు టీమిండియా (అప్‌డేటెడ్): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు మ్యాచ్‌లు), రవి బిష్ణోయ్


