
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2025 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం శ్రేయస్.. న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీతో పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓట్ల ద్వారా శ్రేయస్‌ను ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా (మార్చి) నిర్ణయించారు.
శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి (2022 ఫిబ్రవరి, 2025 మార్చి). భారత క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా (2024 జూన్, 2024 డిసెంబర్) మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. భారత్ తరఫున గిల్ అత్యధికంగా మూడు సార్లు (2023 జనవరి, 2023 సెప్టెంబర్, 2025 ఫిబ్రవరి) ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు.
2021 జనవరిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐసీసీ ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు అమల్లోకి వచ్చిన తొలి మూడు నెలల్లో భారత ఆటగాళ్లే (పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్) ఈ అవార్డు గెలవడం విశేషం.
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్న టీమిండియా క్రికెటర్లు..
శుభ్‌మన్ గిల్-3
జస్ప్రీత్‌బుమ్రా-2
శ్రేయస్ అయ్యర్-2
రిషబ్ పంత్-1 (2021 జనవరి)
రవిచంద్రన్ అశ్విన్-1 (2021 ఫిబ్రవరి)
భువనేశ్వర్ కుమార్-1 (2021 మార్చి)
విరాట్ కోహ్లి-1 (2022 అక్టోబర్)
యశస్వి జైస్వాల్-1 (2024 ఫిబ్రవరి)
మార్చి నెలలో శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. శ్రేయస్ ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ భారత్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో శ్రేయస్ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 79 పరుగులు చేసిన శ్రేయస్.. సెమీస్‌లో ఆసీస్‌పై 45, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ మిడిలార్డర్‌లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
మహిళల విభాగంలో వాల్
మహిళల విభాగంలో మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం చేతన ప్రసాద్ (యూఎస్‌ఏ), జార్జియా వాల్ (ఆస్ట్రేలియా), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (ఆస్ట్రేలియా) పోటీ పడగా.. జార్జియా వాల్ విజేతగా నిలిచింది.