వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..! శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు | Shreyas Iyer Shuts Down Vaibhav Sooryavanshi Debut Talks Ahead Of 1st India Vs England T20I, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ENG vs IND: వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..! శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు

Jun 30 2026 9:37 PM | Updated on Jul 1 2026 10:58 AM

Shreyas Iyer Shuts Down Vaibhav Sooryavanshi Debut Talks Ahead of 1st India vs England T20I

యూకే పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో కఠిన సవాల్ ఎదురు కానుంది. జూలై 1 నుంచి భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జ‌ట్ల తొలి టీ20 డర్హామ్ వేదికగా బుధవారం జరగనుంది. ఐర్లాండ్ చేతిలో ఎదరైన ఘోర పరాభవం నుంచి తిరిగి పుంజుకుని ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాలని భారత్ పట్టుదలతో ఉంది.

అయితే ఐర్లాండ్ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కనీసం ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనా ఆడిస్తారా? లేదా? అన్న చ‌ర్చ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల‌లోనూ విఫ‌ల‌మైన సంజూ శాంసన్ స్ధానంలో సూర్య‌వంశీకి ఛాన్స్ ఇవ్వాల‌ని చాలా మంది సూచిస్తున్నారు. మ‌రికొంద‌రు ఇషాన్ కిష‌న్‌ను ప‌క్క‌న పెట్టి వైభ‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోవాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. తొలి టీ20కు ముందు ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో శ్రేయస్‌ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా జ‌ట్టు కూర్పు కోసం అయ్య‌ర్‌ను విలేక‌రులు ప్ర‌శ్నించారు. అయితే తుది జట్టు కాంబినేషన్‌ను ముందుగానే వెల్లడించడం తనకు ఇష్టం లేదని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.

తొలి టీ20 కోసం మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాం. అయితే మేము ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామో బహిరంగంగా వెల్లడించలేను. ఎందుకంటే ప్రత్యర్థులకు మా వ్యూహాలు తెలిసిపోతాయి. అందుకే గోప్యంగా ఉంచాలనుకుంటున్నాను అని శ్రేయస్ పేర్కొన్నాడు.

అదేవిధంగా  వైభవ్ సూర్యవంశీ గురించి విలేకరులు శ్రేయస్‌ను మరోసారి ప్రశ్నించారు. అయితే సూర్యవంశీ జట్టులో ఉంటాడా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా అయ్యర్‌.. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగుపై  ప్రశంసల జల్లు కురిపించాడు.

"సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. వైభవ్ వంటి గన్ ప్లేయర్‌ను బెంచ్‌లో కూర్చోబెట్టడం కెప్టెన్‌గా ఎంత కష్టమో నాకు తెలుసు. అలాగే అతడికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కూడా సవాల్‌గా మారింది. 

ఎందుకంటే గత కొన్ని సిరీస్‌లుగా అద్భుతంగా రాణించిన ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కాబట్లట్టి  సీనియర్లకు మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. కానీ వైభవ్‌కు ఎప్పుడు అవకాశం వచ్చినా ఖచ్చితంగా అత్యుత్తమంగా రాణిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" శ్రేయస్ వెల్లడించాడు. అయితే శ్రేయస్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్‌కు మరోసారి నిరాశే ఎదురయ్యే అవకాశముంది.
చదవండి: ఆస్ట్రేలియాకు గుడ్ బై.. వేరే దేశానికి ఆడ‌నున్న స్టార్ ఆల్‌రౌండ‌ర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement