షోయబ్ అక్తర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా పేరు గాంచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బాల్(161.3 కి.మీ/గం) రికార్డు ఇప్పటికే అక్తర్ పేరిటే ఉంది. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించిన అక్తర్.. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
తాజాగా ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌పై భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. అక్తర్‌కు బౌలింగ్ పట్ల ఉన్న అంకితభావాన్ని మునాఫ్ పటేల్ కొనియాడాడు. "షోయబ్ అక్తర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి. దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా లాంటి పరిస్థితుల్లో 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అతడి పట్టుదలకు హ్యాట్సాఫ్. వేగంగా బౌలింగ్ చేయడం వల్ల అక్తర్ రెండు మోకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
రిటైర్మెంట్ తర్వాత అతడు సరిగ్గా నడవడానికి నాలుగైదు సంవత్సరాలు పట్టింది. అక్తర్ చాలా మొండోడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే పిచ్చి. అలాంటి పిచ్చి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడు"అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మునాఫ్ పటేల్ పేర్కొన్నాడు.
అక్తర్ చివరగా 2011 ప్రపంచకప్‌లో ఆడాడు. పాక్ తరపున 46 టెస్టులు ఆడి 178 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడి పేరిట 247 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. కాగా షోయబ్ తన కెరీర్‌లో నిలకడగా ఒకే వేగంతో బౌలింగ్ చేసేందుకు ఎన్నో సవాళ్లును ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌లకు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకునేవాడినని అతడే చాలా సార్లు చెప్పాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్!


