రాజస్తాన్ రాయల్స్ టీమ్ మేనెజర్ రోమీ భిందర్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడిన వ్యవహారంపై విచారణ ఓ కొలుక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వైద్యపరమైన కారణాల వల్లే డగౌట్‌లో ఫోన్ చూడాల్సి వచ్చిందని భిందర్ బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అదేవిధంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోమీ తన ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్, మేసెజ్‌లు గానీ చేయలేదని ఏసీయూ నిర్ధారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనప్పటికి రోమీ భిందర్ నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీసీసీఐ జరిమానా విధించేందుకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా రోమీ పక్కన ఉండి ఫోన్ చూసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కేవలం హెచ్చరించి వదిలేయాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
అసలేమి జరిగిందంటే?
ఈ ఏడాది సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రోమీ భిందర్ డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఆ సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉండి ఫోన్ వైపు చూడటం వివాదాస్పదమైంది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం..మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. దీంతో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అతడికి నోటీసులు జారీచేసింది. నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాలని ఏసీయూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే రోమీ బీసీసీఐ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి: విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్


