పేట్రేగిపోయిన షకీబ్‌.. కేవలం 20 బంతుల్లోనే.. అత్యుత్తమంగా..! | CPL 2025: Shakib Al Hasan Smashes 20-Ball Fifty, Tim Seifert Hits Record-Breaking 125* for St Lucia Kings | Sakshi
Sakshi News home page

పేట్రేగిపోయిన షకీబ్‌.. కేవలం 20 బంతుల్లోనే.. అత్యుత్తమంగా..!

Sep 1 2025 12:54 PM | Updated on Sep 1 2025 1:05 PM

Shakib Al Hasan Records Career Best Strike Rate With A 20 Ball Fifty In CPL 2025

బంగ్లాదేశ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025లో పేట్రేగిపోయాడు. చాన్నాళ్ల తర్వాత అతడు బ్యాట్‌ ఝులిపించాడు. ఈ లీగ్‌లో ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌కు ఆడుతున్న షకీబ్‌.. నిన్న (ఆగస్ట్‌ 31) సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు.

ఇది అతనికి టీ20 కెరీర్‌లో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ. గతేడాది బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ షకీబ్‌ 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ (రంగ్‌పూర్‌ రైడర్స్‌కు ఆడుతూ ఖుల్నా టైగర్స్‌పై) పూర్తి చేశాడు.

తాజా హాఫ్‌ సెంచరీతో​ షకీబ్‌ మరో రికార్డు కూడా సాధించాడు. తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్‌ను (హాఫ్‌ సెంచరీ) నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 234.61 స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన షకీబ్‌.. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 234.62 స్ట్రయిక్‌రేట్‌తో 61 పరుగులు చేశాడు.

షకీబ్‌ బ్యాట్‌తో విజృంభించినా ఈ మ్యాచ్‌లో అతని జట్టు ఫాల్కన్స్‌ ఓటమిపాలైంది. ఫాల్కన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసకర శతకంతో (125 నాటౌట్‌) విరుచుకుపడటంతో లూసియా కింగ్స్‌ మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ సెంచరీతో సీఫర్ట్‌ పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతను.. సీపీఎల్‌ చరిత్రలో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. గతంలో ఆండ్రీ రసెల్‌ కూడా 40 బంతుల్లోనే శతక్కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో సీఫర్ట్‌ చేసిన స్కోర్‌ (125 నాటౌట్‌) కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే రెండో అత్యధికం. ఈ రికార్డు బ్రాండన్‌ కింగ్‌ పేరిట ఉంది. 2019 ఎడిషన్‌లో కింగ్‌ గయానా అమెజాన్‌ వారియర్స్‌కు ఆడుతూ బార్బడోస్‌ ట్రైడెంట్స్‌పై అజేయమైన 132 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌తో సీఫర్ట్‌ ఖాతాలో మరో రెండు రికార్డులు కూడా చేరాయి. ఛేదనలో (కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో) అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా సీఫర్ట్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్‌ (121 నాటౌట్‌) పేరిట ఉండేది.

ఈ సెంచరీతో సీఫర్ట్‌ సెయింట్‌ లూసియా కింగ్స్‌ తరఫున అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఫాఫ్‌ డుప్లెసిస్‌ పేరిట ఉండేది. ఫాఫ్‌ 2021 సీజన్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌పై అజేయమైన 120 పరుగులు చేశాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement