టీమిండియాలో చోటిస్తారా? లేదా?.. సెలక్టర్లకు వార్నింగ్‌! | Sarfaraz Khan Sends Reminder To BCCI Selectors With Double Century | Sakshi
Sakshi News home page

రీసౌండ్‌ వచ్చేలా.. టీమిండియా తలుపులు బాదుతున్న సర్ఫరాజ్‌!

Jan 23 2026 3:19 PM | Updated on Jan 23 2026 3:51 PM

Sarfaraz Khan Sends Reminder To BCCI Selectors With Double Century

ముంబై క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో దుమ్ములేపాడు. తద్వారా టెస్టు జట్టు నుంచి తనను తప్పించిన సెలక్టర్లకు మరోసారి బ్యాట్‌ ద్వారానే గట్టి హెచ్చరికలు జారీ చేశాడు.

కాగా ఫార్మాట్లకు అతీతంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) దేశీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా డిసెంబరు 2న శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 31న మరోసారి సెంచరీ బాదాడు.

ఈసారి ద్విశతకంతో 
తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో భాగంగా గురువారం హైదరాబాద్‌- ముంబై మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన సిరాజ్‌ సేన.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

227 పరుగులు
ఈ క్రమంలో తొలిరోజు శతక్కొట్టిన సర్ఫరాజ్‌.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 219 బంతులు ఎదుర్కొన్న అతడు 227 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, రక్షణ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో సర్ఫరాజ్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

ఇక సర్ఫరాజ్‌కు తోడు కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌  (104) శతక్కొట్టాడు. సువేద్‌ పార్కర్‌ 75, అథర్వ అంకోలేకర్‌ 35 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 560 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రోహిత్‌ రాయుడు రెండు, నితిన్‌ సాయి యాదవ్‌, కొడిమెల హిమతేజ, కెప్టెన్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

టీమిండియాలో పునరాగమనం చేసేనా?
దేశీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి సత్తా చాటాడు. అయితే, చివరగా 2024లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన సర్ఫరాజ్‌ను సెలక్టర్లు మళ్లీ జట్టుకు ఎంపిక చేయలేదు.

ఈ క్రమంలో దేశీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో రాణిస్తూ సర్ఫరాజ్‌ సెలక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు. కాగా ఇప్పటి వరకు అతడు టీమిండియా తరఫున టెస్టులు మాత్రమే ఆడాడు. వన్డే, టీ20 జట్లలో అరంగేట్రం చేయలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఐపీఎల్‌-2026తో బిజీ కానున్నారు భారత ఆటగాళ్లు. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనతో మళ్లీ టీమిండియా విధుల్లో చేరతారు.  

చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement