‘డాడీ.. ఏంటీ పొట్ట, నా కోసం పొట్ట తగ్గిస్తావా?’ | Inspired By Daughters Request Father Loses 10 kG And Transform His Body | Sakshi
Sakshi News home page

‘డాడీ.. ఏంటీ పొట్ట, నా కోసం పొట్ట తగ్గిస్తావా?’

Mar 2 2026 11:25 AM | Updated on Mar 2 2026 11:59 AM

Inspired By Daughters Request Father Loses 10 kG And Transform His Body

వృత్తి రీత్యా ఆయన ట్రాఫిక్‌  పోలీసు .. నిత్యం విధులతో బిజీగా ఉండే ఆయన రహదారి భద్రతకు, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్‌ సిబ్బందిని పర్యవేక్షించడంతోనే రోజు గడిచిపోతుంది. అయితే అంతటితో ఆగిపోలేదు.. విధుల్లో భాగమైన ఫిట్‌నెస్‌పైనా దృష్టిపెట్టారు.. జిమ్‌లో బరువులు ఎత్తుతూ కండలు పెంచారు. న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ లాగా కాకుండా సంకల్పంతో చేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ ఎంతో శ్రమ, పట్టుదల, నిరంతరం వ్యాయామం, సరైన డైట్‌ పాటిస్తూ సిక్స్‌ ప్యాక్‌తో మెప్పిస్తున్నారు. ఆయనే ఇటీవల సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో జరిగిన ‘తెలంగాణ నాల్గో పోలీసు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2016’లో బాడీ బిల్డింగ్‌ పోటీల్లో వెండి పతకం సాధించిన గంటా మల్లేష్‌.     

మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి మల్లేష్‌ను ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించడంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కూర్‌ గ్రామానికి చెందిన మల్లేష్‌ 2007 బ్యాచ్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం ఉప్పల్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఇంటర్‌ నుంచి వ్యాయామం, స్విమ్మింగ్, బాక్సింగ్, హార్స్‌ రైడింగ్‌ వంటి వాటిపై ఆసక్తి ఉండేది. పోలీసు ఉద్యోగం వచ్చాక కొంతకాలం తర్వాత పని ఒత్తిడి, సోమరితనం లైఫ్‌ స్టైల్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. సమయానికి భోజనం చేయకపోవడం, సరైన నిద్రలేకపోవడంతో 86 కిలోల బరువు పెరిగాను. భారీ పొట్టతో శరీరాకృతే మారిపోయింది. ఎక్కువ సేపు నిలబడటం, కూర్చోవడం ఇబ్బంది అయ్యేది.’ అని చెప్తున్నారు.

కూతురు అడిగిందని... 
స్టేషన్‌ నుంచి ఇంటికెళ్లిన తర్వాత నా కూతురు దగ్గరకు వచ్చి, నన్ను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, పొట్ట మీద చేతులతో రుద్దుతూ ఉండేది. అలా ఒక రోజు ‘డాడీ.. ఏంటీ పొట్ట, నా కోసం పొట్ట తగ్గిస్తావా?’ అని ప్రేమగా అడిగింది. అంతే అదే రోజు జిమ్‌లో చేరాను. శిక్షకుడి పర్యవేక్షణలో వ్యాయామం, డైట్‌ పాటించాను. సరిగ్గా మూడు నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. బరువు తగ్గడం కాదు.. బాడీ బిల్డింగ్‌ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా.. కఠోర సాధనతో 86 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాను. 

రోజుకు గంట  కేటాయిస్తేనే.. 
రోజులో ఒక గంట సమయాన్ని మన శరీరం కోసం కేటాయిస్తే.. మిగిలిన 23 గంటలూ మన శరీరం మనకు కేటాయిస్తుంది. ఇదే నా బాడీ బిల్డింగ్‌ సీక్రెట్‌. నన్ను ఆదర్శంగా తీసుకొని స్నేహితుల పిల్లలు కూడా నిరంతరం వ్యాయామం చేస్తున్నారు. 
– గంటా మల్లేష్‌, ఉప్పల్‌  ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement