సాక్షి, హైదరబాద్: మహా నగరం మేడారం బాటపట్టింది. నేటినుంచి ఈ నెల 31 వరకు కొనసాగనున్న మేడారం మహా జాతరకు నగరవాసులు భారీసంఖ్యలో తరలి వెళ్లనున్నారు. అదనంగా 1,500 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది.
కార్లు, మ్యాక్సీ క్యాబ్‌లు బారులు..
ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు తదితర ప్రైవేట్ వాహనాల్లోనే కాకుండా సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. దీంతో ఉప్పల్– వరంగల్ మార్గంలో రద్దీ పెరిగింది. రహదారులపై పెద్ద ఎత్తున కార్లు తదితర వాహనాలు బారులు తీరాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగనుంది. బస్సులు, రైళ్లు తదితర వాహనాల్లో మేడారం జాతర కోసం సుమారు 10 లక్షల మందికిపైగా నగరవాసులు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా.
ఎంజీబీఎస్‌లో చిన్నారులకు రిస్ట్ బ్యాండ్
అఫ్జల్‌గంజ్: లక్షలాది మంది భక్తులు తరలివెళ్లే మేడారం మహా జాతరలో పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక భద్రత కోసం రిస్ట్ బ్యాండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ తెలిపారు. వోడాఫోన్ ఐడియా సహకారంతో రూపొందించిన రిస్ట్ బ్యాండ్‌లో క్యూఆర్ కోడ్ టెక్నాలజీ ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రుల సంపూర్ణ సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. పిల్లలు తప్పిపోయిన పక్షంలో సమీపంలోని వలంటీర్ల సహకారంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారు ఎక్కడ ఉన్నారో గుర్తించవచ్చు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ అదనపు డీసీపీలు కృష్ణగౌడ్, శ్యామ్‌బాబు, గోషామహల్ డివిజన్ ఏసీపీ సుదర్శన్, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.రవి, టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ జె.శ్రీలత పాల్గొన్నారు.


