టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ విమర్శించాడు. కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా వారికి అవకాశాలు ఇస్తున్న యాజమాన్యం.. సర్ఫరాజ్ ఖాన్ వంటి అద్భుత ఆటగాడిని మాత్రం పక్కనపెట్టిందన్నాడు.
కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ టీ20, వన్డే టోర్నీలలో శతక్కొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మెరిశాడు. ఉప్పల్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకుని ముంబైకి భారీ స్కోరు అందించాడు. మొత్తంగా 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 227 పరుగులు సాధించాడు.
ఐదో డబుల్ సెంచరీ
ఫలితంగా హైదరాబాద్‌తో జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 332/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 123.2 ఓవర్లలో 560 పరుగులకు ఆలౌటైంది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఐదో డబుల్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సువేద్ పార్కర్ (98 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.
ఈ సీజన్‌లో సర్ఫరాజ్ విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో గోవాపై (157)పై సెంచరీ... ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీపై అస్సాంపై (100 నాటౌట్) సెంచరీ సాధించాడు. ఇక హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అజారుద్దీన్‌కు క్రెడిట్ ఇచ్చాడు.
ఎలా ఆడాలో చూపించారు
‘‘నా కెరీర్‌లో పెద్దగా రివర్స్ స్వింగ్ షాట్లు ఆడలేదు. అజర్ సర్‌ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనతో క్రికెట్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ఆయన ఆఫీసుకు వెళ్లాను.
ఇక్కడ (ఉప్పల్) ఆరంభంలోనే ఎక్కువ రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అజర్ సర్ చెప్పారు. ఇన్‌స్వింగ్ ఎలా రాబట్టాలో వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కుర్చీ నుంచి లేచి నిలబడి మరీ వివిధ రకాల షాట్లు ఎలా ఆడాలో చూపించారు. దాదాపు రెండు గంటల పాటు మా సంభాషణ కొనసాగింది’’ అని సర్ఫరాజ్ ఖాన్ అజారుద్దీన్ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.
అతడొక అటాకింగ్ బ్యాటర్
ఇక ఇందుకు స్పందనగా.. ‘‘డబుల్ సెంచరీ విషయంలో క్రెడిట్ మొత్తం సర్ఫరాజ్‌కే దక్కాలి. తను నా ఆఫీస్‌కు వచ్చి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. నేనూ కొన్ని విషయాలు అతడికి చెప్పాను. అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్‌కు శుభాకాంక్షలు.
అతడు గొప్పగా ఆడాడు. టీమిండియాకు అతడిని మళ్లీ ఎంపిక చేయాలి. సర్ఫరాజ్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదు. అతడొక అటాకింగ్ బ్యాటర్. మిగిలిన ప్లేయర్లకు ఇచ్చినట్లు అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని టీమిండియా సెలక్టర్ల తీరును అజారుద్దీన్ విమర్శించాడు.
చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్


