
సింధుకు సైనా నెహ్వాల్ సూచన
గెలవగలిగే టోర్నీలే ఆడాలి
వెటరన్ షట్లర్ సైనా నెహ్వల్ వ్యాఖ్య
ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు మరిన్ని టైటిల్స్ గెలిచే సత్తా ఉందని, ఎలా గెలవాలో కూడా తనకు బాగా తెలుసని... అయితే మూడు పదుల వయసును గుర్తించి ఇకపై ఆడాలని వెటరన్ షట్లర్ సైనా నెహ్వల్ సూచించింది. ఈ ఏడాది సింధుకు గడ్డు కాలం నడుస్తోంది. రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాల విజేత అయిన ఆమె ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలుపొందలేకపోయింది.
ఒక్క ప్రపంచ చాంపియన్‌షిప్ మినహా చాలా టోర్నీల్లో మొదటి లేదంటే రెండో రౌండ్లలోనే నిష్క్రమించింది. గతనెల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సైనా మాట్లాడుతూ.. తన సహచర షట్లర్‌కు పలు సూచనలు చేసింది. ఆ వివరాలు ఆమే మాటల్లోనే...
వయసు మాట వినాలి
వయసు పైబడిన తర్వాత ఆడలేరని కాదు... మునుపటిలా ఆడలేమన్నది వాస్తవం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మన ఆట కొనసాగించాలి. సింధు కూడా ఇదే చేయాలి. ఆమెలో గెలిచే సత్తా ఇంకా వుంది. అయితే వరుసగా అన్ని ఆడుతూ వుండటమే సరికాదు. ఇలా అన్ని కాకుండా కొన్ని ఎంపిక చేసిన టోర్నీలు, బాగా అచ్చొచ్చే సిరీస్‌లు, తను గెలుపొందగలననే ఈవెంట్లను ఎంచుకొని అందులో ఆడితేనే సింధుకు మేలు చేస్తుంది.
మూడు పదుల వయసొచ్చాక వరుసబెట్టి ఆడటం, గెలవడం, ర్యాంకును నిలకడగా కొనసాగించడం చాలా కష్టం. ఫలానా ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే ఆసియా చాంపియన్‌షిప్‌లో అదరగొడతాను అనుకునే టోర్నీల్లో దిగి పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో అడొచ్చు. గెలవొచ్చు.
ఆమెకు అన్నీ తెలుసు
ఈ సీజన్‌లో సింధు బరిలోకి దిగాల్సిన టోర్నీలు ఇంకా ఉన్నాయి. తప్పకుండా అందులో రాణించే సత్తా ఆమెకు వుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా తనలో చేవ తగ్గలేదని నిరూపించుకుంది. తదుపరి టోర్నీల్లోనూ సింధు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇవ్వగలదు.
పురుషుల సింగిల్స్‌కు ఢోకా లేదు
భారత బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్ భవిష్యత్తుకు ఏ ఢోకా లేదు. లక్ష్యసేన్, ప్రియాన్షు రావత్, హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ ఇలా పలువురు షట్లర్లు ఉన్నారు. కానీ మహిళల సింగిల్సే కాస్త ఇబ్బందికరం. ప్రస్తుతం ఒక్క సింధు మినహా ఈ కేటగిరీలో చెప్పుకోదగ్గ ప్లేయరే లేదు. యువ షట్లర్లు మరింత మంది రావాలి. కొందరు అడపాదడపా బాగానే ఆడుతున్నారు కానీ నిలకడగా రాణించే వారే కరువయ్యారు.
వచ్చే నెల జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ జరుగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ఎలాంటి ప్రతిభావంతులు వస్తారో చూడాలి. ప్రపంచ పురుషుల డబుల్స్‌లోనే సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టిలది అసాధారణ జోడీ. ప్రతీ టోర్నీని గెలవగలిగే సత్తా ఈ జంటకు ఉంది. సాత్విక్–చిరాగ్‌ల ఆటతీరును చూసినా... ప్రపంచంలోనే నంబర్‌వన్ జోడీ ఆటను చూసినా ఒకే తీరుగా ఉంటుంది.