
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) అభిమానులకు శుభవార్త చెప్పింది. భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kasyap)తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘దూరం దగ్గర చేసింది’’ అని క్యాప్షన్ ఇచ్చింది. తద్వారా తాము తిరిగి కలిసిపోయామనే సంకేతాలు ఇచ్చింది.
కాగా భర్త పారుపల్లి కశ్యప్‌తో తాను విడిపోతున్నట్లు (Divorce) సైనా నైహ్వాల్ గత నెలలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూలై 13న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఆలోచించే విడాకుల నిర్ణయం
‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణించేలా చేస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల అనంతరం నేను, కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఈ బంధంలో నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇకపై కూడా మేము స్నేహితుల్లా కొనసాగుతాం’’ అని సైనా నోట్ విడుదల చేసింది.
ఊహించని ట్విస్ట్
అయితే, తాజాగా శనివారం పారుపల్లి కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోలను సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు దూరమే.. మన సన్నిహితులతో కలిసి ఉండటం ఎంత విలువైనదో నేర్పుతుంది. మేము కలిసి ఉండేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాం’’ అని రెండు హార్ట్ ఎమోజీలతో సైనా క్యాప్షన్ జతచేసింది.
కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసేవాళ్లు. అయితే, సైనా విడాకుల ప్రకటన చేయగా.. కశ్యప్ మాత్రం అపుడు స్పందించలేదు.
ఇక ఇప్పుడు భార్యతో కలిసి పోస్ట్ షేర్ చేస్తూ తమ రీయూనియన్‌ని మాత్రం తెలియజేశాడు. కాగా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా కాంస్యం గెలవగా.. అదే ఎడిషన్‌లో కశ్యప్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.
చదవండి: నిప్పుతో చెలగాటం ఆడటమే.. వరల్డ్‌కప్ గెలిస్తే ధోని గొప్పవాడు అయిపోతాడా?