అందుకే విడాకులు తీసుకున్న: దేవెగౌడ
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు. దేవెగౌడ్ కాంగ్రెస్‌తో ప్రేమాయణం సాగించి, మోదీని పెళ్లి చేసుకున్నారంటూ బుధవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఖర్గే చేసిన వ్యాఖ్యపై దేవెగౌడ ‘ఎక్స్’లో స్పందించారు. ఖర్గే మాట్లాడినప్పుడు సభలో లేనని పేర్కొన్నారు. 2018లో కాంగ్రెస్ నాయకత్వం గులాం నబీ ఆజాద్‌ను తన వద్దకు రాయబారానికి పంపించిందని గుర్తు చేసుకున్నారు.
తన తనయుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించలేదని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేయాలంటూ సూచించానని స్పష్టం చేశారు. కుమారస్వామి విషయంలో ఆజాద్ పట్టుబట్టారని అన్నారు. కానీ, 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను పక్కనపెట్టి బీజేపీలో చేరిపోయారని చెప్పారు. వారిని బీజేపీలోకి ఎవరు పంపించారో అందరికీ తెలుసని ఉద్ఘాటించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తిని కాంగ్రెస్ పెద్దలు ఆనాడు అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ కూటమిని తాను వదిలేయలేదని, వారే వెళ్లిపోయారని స్పష్టంచేశారు. విడాకులు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిని వారే సృష్టించారని దేవెగౌడ తేలి్చచెప్పారు.


