breaking news
H.D. Deve Gowda
-
మాజీ ప్రధాని దేవెగౌడకు భారీ జరిమానా
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో రూ.2 కోట్లు చెల్లించాలని దేవెగౌడను ఆదేశించింది. 2011 జూన్‌లో ఓ కన్నడ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్‌పై దేవెగౌడ వ్యాఖ్యలు చేశారు. పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ సదరు సంస్థ ప్రతినిధులు కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం.. నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ. 2కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, నష్టపరిహారంగా దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు ఎన్ఐసీఈ కంపెనీ డిమాండ్ చేసింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్‌పై ఇంటర్వ్యూలో చేసిన తన వాదనను ధృవీకరించడంలో దేవెగౌడ విఫలయ్యారని కోర్టు తేల్చింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దానికంటే ఎక్కువ భూమిని వినియోగించిందని దేవెగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు. చదవండి: గోడను బద్దలు కొట్టి.. రూ.55 లక్షలు దోపిడీ -
‘భారత్ సూపర్ పవర్ ’ శాస్త్రవేత్తలతోనే సాధ్యం
సాక్షి, బెంగళూరు : భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ఈ విషయంలో రాజకీయ నాయకులు ఏమీ చేయలేరని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. గురువారం ఆయన న గరంలోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాజకీయ నాయకులు కేవలం దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు హామీలు మాత్రమే ఇవ్వగలరు కానీ, ఆ హామీలను కార్యరూపంలోకి తీసుకొచ్చి భారత్‌ను ప్రపంచ పటంలో సూపర్‌పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో అణు పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమయ్యామని తెలిపారు. అయితే ఆ సమయంలో అణు పరీక్షలపై అమెరికా ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. అయినా కూడా ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సలహాతో అణు పరీక్షలకు సన్నద్ధమయ్యామని చెప్పారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే అణు పరీక్షల నుంచి వెనకడుగు వేశాం తప్పితే అమెరికా ఆంక్షలకు బెదిరి కాదని అన్నారు. బెంగళూరు నగరం ఐటీ రాజధానిగా గుర్తింపు పొందడానికి తాను ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే ప్రధాన కారణమని దేవెగౌడ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యుత్, ఇతర ఇంధనాల తీవ్రత అధికంగా ఉందని, ఈ తీవ్రతను ఎదుర్కొనేలా దేశం స్వావలంబన సాధించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్.మహేషప్ప తదితరులు పాల్గొన్నారు.