
క్లిష్ట పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా పరిస్థితులు చక్కదిద్దడంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) దిట్ట. ఓటమి ఖాయమనుకున్న సందర్భాల్లోనూ ఒత్తిడిని చిత్తు చేసి.. ప్రశాంత వదనంతోనే ప్రత్యర్థిని మట్టికరిపించడంలో తనకు తానే సాటి. అందుకే అతడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు.
‘జీవిత సత్యాలు’ చెప్పిన ధోని
అయితే, ఆటగాడిగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ ధోని మిస్టర్ కూల్‌గానే ఉంటాడు. భార్య సాక్షి (Sakshi Singh) ఏం చెప్పినా సరేనంటూ తలాడిస్తాడట. అలా అయితేనే ప్రతి మగాడి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందట. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ధోని ఇలా ‘జీవిత సత్యాలు’ చెప్తూ వధూవరులకు సలహాలు ఇవ్వడంతో పాటు అక్కడనున్న వారందరినీ నవ్వించాడు.
‘‘వివాహం అనేది ఎంతో గొప్పది. పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఆరాటపడుతూ ఉంటారు. వారికి నిప్పుతో చెలగాటం ఆడటం ఇష్టం గనుకే ఆ తొందర. అందులో ఇతడు కూడా ఒకడు’’ అంటూ వరుడు ఉత్కర్ష్‌పై హాస్యబాణాలు సంధించాడు ధోని.
వరల్డ్‌కప్ గెలిస్తే ధోని గొప్పోడు అయిపోడు!
‘‘ఉత్కర్ష్ కూడా ఇప్పుడు ఈ భ్రమల్లోంచి బయటకు వస్తాడు. ప్రతి భర్త కథ ఒకేలా ఉంటుంది. నువ్వు ప్రపంచకప్ గెలిచావా? లేదా అన్న విషయంతో అస్సలు సంబంధం ఉండదు. అయితే, మా ఆవిడ మాత్రం అందరి కంటే భిన్నం అనుకోండి’’ అంటూ ధోని జోకులు వేశాడు. ఇక వధువు ధ్వనికి కూడా ధోని ఈ సందర్భంగా ఓ సలహా ఇచ్చాడు.
‘‘మీ భర్త ఎప్పుడైనా కోపంగా ఉన్నారంటే.. ఒక్క మాట కూడా మాట్లాడకండి. ఎందుకంటే.. భర్తలు కేవలం ఐదంటే ఐదే నిమిషాల్లో కూల్ అయిపోతారు. మాకు మాత్రమే ఆ శక్తి ఉంది.
అయినా.. ఇవన్నీ జోకులు అనుకుని చాలా మంది మగవాళ్లు నవ్వుతూ ఉంటారు. మీరెందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు. కానీ ఇదే నిజం’’ అంటూ ధోని నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మూడు ట్రోఫీలు గెలిచిన దిగ్గజ కెప్టెన్
కాగా 2004- 2019 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ధోని.. 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 10773, టీ20లలో 1617, టెస్టుల్లో 4876 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 10 వన్డే, ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.
ఇక ఇంత వరకు ఏ టీమిండియా కెప్టెన్‌కూ సాధ్యం కాని విధంగా ధోని.. ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ధోని సేన గెలుచుకుంది.
అదే విధంగా ఐపీఎల్‌లోనూ ధోని అద్భుత విజయాలు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత తలా సొంతం. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడిన ధోని 5439 పరుగులు సాధించాడు.
ఇక ధోని వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సాక్షి సింగ్ రావత్‌ను ప్రేమించిన ధోని 2010లో ఆమెను పెళ్లాడాడు. వీరి 2015లో కుమార్తె జీవా జన్మించింది.
చదవండి: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా