
సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్‌తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్’’ కోసం ఇద్దరం ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్ అనే చెప్పాలి.
సాధారణంగా స్పోర్ట్స్ స్టార్స్‌కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.
ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.
ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్ స్టార్ సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.
మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
నాటి ఒక యువ టాలీవుడ్ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్ వాసే. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్ స్పోర్ట్స్ స్టార్స్ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.
అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్ అజారుద్దీన్ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు.