
పావొలిని, రిబాకినా కూడా...
పురుషుల్లో రూన్, ముసెట్టి
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ అరియాన సబలెంక, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వీరిద్దరితో పాటు నాలుగో సీడ్ పావొలిని, ఎనిమిదో సీడ్ క్విన్‌వెన్ జెంగ్, 12వ సీడ్ రిబాకినాలు కూడా ప్రిక్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి, పదో సీడ్ హోల్గర్ రూన్‌లు కూడా ప్రిక్వార్టర్స్ సమరానికి అర్హత సంపాదించారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
అలవోక విజయంతో...
మహిళల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోటీల్లో నిరుటి క్వార్టర్ ఫైనలిస్ట్, తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సబలెంక (బెలారస్) 6–2, 6–3తో సెర్బియన్ ప్లేయర్ ఓల్గా డానిలోవిచ్ అలవోక విజయం సాధించింది. కేవలం గంటా 19 నిమిషాల్లోనే సెర్బియన్ ప్రత్యర్థి ఆట కట్టించింది. గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్ దాకా పోరాడిన ఓల్గా ఈసారి మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో హ్యాట్రిక్ చాంపియన్ (2022, 2023, 2024), పోలండ్ స్టార్ స్వియాటెక్ వరుసగా నాలుగో టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది.
మూడో రౌండ్లో ఐదో సీడ్ స్వియాటెక్ 6–2, 7–5తో జాక్వెలైన్ క్రిస్టిన్ (రొమేనియా)పై గెలుపొందగా, నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ) 6–4, 6–1తో ఉక్రెయిన్‌కు చెందిన యులియా స్టారొడుత్సెవాను ఓడించింది. 12వ సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–2తో జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలుపొందగా, ఆ్రస్టేలియన్ ఓపెన్ మాజీ రన్నరప్, చైనా స్టార్ క్విన్‌వెన్ జెంగ్ 6–3, 6–4తో విక్టోరియా ఎం»ొకొ (కెనడా)పై విజయం సాధించింది.
చెమటోడ్చిన రూన్
పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో హోల్గర్ రూన్ (డెన్మార్క్) 4–6, 6–2, 5–7, 7–5, 6–2తో క్వెంటిన్ హలైస్ (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి (ఇటలీ) 4–6, 6–4, 6–3, 6–2తో మరియానో నెవొన్ (అర్జెంటీనా) గెలుపొందగా, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 3–6, 7–6 (9/7), 3–6, 6–3తో కరెన్ కచనొవ్ (రష్యా)పై పోరాడి గెలిచాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ జోడీ
భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ–గాలోవే (అమెరికా) ద్వయం 6–7 (4/7), 7–6 (7/4), 6–3తో ఏడో సీడ్ నికోల మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (ఆ్రస్టేలియా) జంటపై ఆఖరిదాకా పోరాడి గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ... అమెరికాకు చెందిన తొమ్మిదో సీడ్ క్రిస్టిన్ హ్యరీసన్– ఇవాన్ కింగ్ జంటతో తలపడుతుంది.