ఈసారి కొత్త ‘ఫ్రెంచ్‌’ క్వీన్‌ | Sabalenka and Coco Gauff in French Open final | Sakshi
Sakshi News home page

ఈసారి కొత్త ‘ఫ్రెంచ్‌’ క్వీన్‌

Jun 6 2025 2:23 AM | Updated on Jun 6 2025 2:23 AM

Sabalenka and Coco Gauff in French Open final

ఫైనల్లో సబలెంకా, కోకో గాఫ్‌

సెమీస్‌లో డిఫెండింగ్‌ 

చాంపియన్‌ స్వియాటెక్‌పై బెలారస్‌ స్టార్‌ విజయం

‘వైల్డ్‌ కార్డు’ బొయిసన్‌ జోరుకు అమెరికా స్టార్‌ బ్రేక్‌  

గత మూడేళ్లుగా పారిస్‌లోని ఎర్రమట్టి కోర్టులపై తన ఆధిపత్యం చాటుకున్న పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ ఈసారి రిక్తహస్తాలతో వెనుదిరగనుంది. వరుసగా నాలుగో ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గాలని భావించిన స్వియాటెక్‌ను బెలారస్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ అరీనా సబలెంకా బోల్తా కొట్టించింది. మరోవైపు అమెరికా స్టార్‌ కోకో గాఫ్‌ కూడా తన జోరును కొనసాగిస్తూ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. 

‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగిన ప్రపంచ 361వ ర్యాంకర్, ఫ్రాన్స్‌ రైజింగ్‌ స్టార్‌ లూయి బొయిసన్‌ ప్రస్థానం సెమీఫైనల్‌కు పరిమితమైంది. సబలెంకా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరడం... 2022లో తుది పోరుకు చేరి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న కోకో గాఫ్‌ కూడా అంతిమ సమరానికి అర్హత పొందిన నేపథ్యంలో... ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌ అవతరించడం ఖరారైంది. శనివారం జరిగే ఫైనల్లో సబలెంకా, కోకో గాఫ్‌ అమీతుమీ తేల్చుకుంటారు.   

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో పోలాండ్‌ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ 1457 రోజుల తర్వాత తొలి పరాజయాన్ని చవిచూసింది. 9–6–2021న చివరిసారి ఈ టోర్నీలో ఓడిపోయిన ఆమె వరుసగా 2022, 2023, 2024లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈసారీ స్వియాటెక్‌ గెలిచి ఉంటే ఓపెన్‌ శకంలో (1968 నుంచి) ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను వరుసగా నాలుగేళ్లు నెగ్గిన తొలి క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించేది. 

తన అసమాన పోరాటంతో చరిత్ర పుటల్లో స్వియాటెక్‌కు స్థానం దక్కకుండా బెలారస్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా 7–6 (7/1), 4–6, 6–0తో స్వియాటెక్‌ను ఓడించి తొలిసారి తన కెరీర్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సబలెంకాకు తొలి రెండు సెట్‌లలో గట్టిపోటీ ఎదురైంది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన సబలెంకా రెండో సెట్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో సెట్‌లో సబలెంకా చెలరేగిపోయింది.

మూడుసార్లు స్వియాటెక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేయడంతోపాటు తన సర్వీస్‌ను మూడుసార్లు నిలబెట్టుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. సబలెంకా దెబ్బకు మూడో సెట్‌లో స్వియాటెక్‌ ఒక్క గేమ్‌ కూడా నెగ్గలేకపోయింది. స్వియాటెక్‌తో 13వసారి తలపడ్డ సబెలంకా ఐదోసారి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ మొత్తంలో మూడు ఏస్‌లు సంధించిన బెలారస్‌ స్టార్‌ రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 

ఆరుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేసింది. 29 విన్నర్స్‌ కొట్టిన సబలెంకా 25 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌ వద్దకు ఎనిమిదిసార్లు దూసుకొచ్చి నాలుగుసార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు స్వియాటెక్‌ ఒక ఏస్‌తో సరిపెట్టుకొని, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 29 విన్నర్స్‌ కొట్టిన ఆమె ఏకంగా 42 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.  

సెమీస్‌లో జొకోవిచ్‌ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 4–6, 6–3, 6–2, 6–4తో గెలుపొంది ఈ టోర్నీలో 13వసారి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.  

రెండో సెమీఫైనల్లో 2022 రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6–1, 6–2తో లూయి బొయిసన్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తుగా ఓడించింది. 69 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో కోకో గాఫ్‌ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. 12 విన్నర్స్‌ కొట్టి, 15 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌ వద్దకు 13 సార్లు దూసుకొచ్చి 8 సార్లు పాయింట్లు నెగ్గింది. 

మరోవైపు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా), క్వార్టర్‌ ఫైనల్లో ఆరోసీడ్‌ మిరా ఆంద్రీవా (రష్యా)లను ఓడించిన బొయిసన్‌ సెమీఫైనల్లో ఒత్తిడికి లోనై తడబడింది. కేవలం ఎనిమిది విన్నర్స్‌ కొట్టిన ఆమె 33 అనవసర తప్పిదాలు చేసింది. ఈ టోర్నీకి ముందు 361వ ర్యాంక్‌లో ఉన్న బొయిసన్‌ తాజా ప్రదర్శనతో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో 68వ స్థానానికి చేరుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement