టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో (50 ఓవర్ల ఫార్మాట్, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా-ఏ నిన్న (నవంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో అజేయ అర్ద సెంచరీ (83 బంతుల్లో 68 నాటౌట్) సాధించిన తర్వాత రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. తద్వారా చతేశ్వర్ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.
ఓవరాల్‌గా.. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ కంటే ముందు కేవలం ఒకే ఒక ఆటగాడు ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే రుతురాజ్ కంటే ముందున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాటర్లు..
మైఖేల్ బెవాన్-57.86 (427 ఇన్నింగ్స్‌లు)
రుతురాజ్ గైక్వాడ్-57.80 (85 ఇన్నింగ్స్‌లు)
సామ్ హెయిన్-57.76 (64 ఇన్నింగ్స్‌లు)
చతేశ్వర్ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్‌లు)
విరాట్ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్‌లు)
ఇప్పటివరకు కెరీర్‌లో 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లు ఆడిన రుతురాజ్ 17 శతకాలు, 18 అర్ద శతకాల సాయంతో 4509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోర్ 220 నాటౌట్‌గా ఉంది.
భీకర ఫామ్
ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మూడు అనధికారిక వన్డే సిరీస్‌లో రుతురాజ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. రెండో వన్డేలో అజేయ అర్ద శతకంతో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతను.. అంతకుముందు తొలి వన్డేలో అద్భుత శతకం (129 బంతుల్లో 117) బాదాడు. రెండో వన్డేలో గెలుపుతో భారత్, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 19న రాజ్‌కోట్‌లో జరుగనుంది.
చదవండి: పాక్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ


