IPL 2025 RCB vs CSK: కోహ్లి X ధోని | Royal Challengers Bangalore will face Chennai Super Kings today | Sakshi
Sakshi News home page

IPL 2025 RCB vs CSK: కోహ్లి X ధోని

May 3 2025 3:27 AM | Updated on May 3 2025 8:32 AM

Royal Challengers Bangalore will face Chennai Super Kings today

నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ‘ఢీ’

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ 18వ సీజన్‌లో మెరుగైన ఆటతీరు కనబరుస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో తలపడనుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగళూరు ‘ప్లే ఆఫ్స్‌’ బెర్తు ఖరారు చేసుకోవడంపై దృష్టి పెడితే... ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్‌’ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులోనూ ఆర్‌సీబీ విజయం సాధించగా... సొంతగడ్డపై జరగనున్న పోరులో అదే జోరు కొనసాగించాలని బెంగళూరు భావిస్తోంది. 

ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 3 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరో విజయం సాధిస్తే ఇక ‘ప్లే ఆఫ్స్‌’కు చేరినట్లే. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 10 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడింది. ఎలాగో ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న సీఎస్‌కే ‘పోరాడితే పోయేదేముంది’ అన్న తరహాలో విజృంభించాలని చూస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు ధోని, కోహ్లి బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. 

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం వచ్చే ఏడాది ధోని ఐపీఎల్‌ ఆడటంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ధోనీ, కోహ్లి కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి కావొచ్చని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది! మరి ఈ పోరులో ధోని సేనను విజయం వరిస్తుందా... బెంగళూరు ‘ప్లే ఆఫ్స్‌’ బెర్తు ఖరారు చూసుకుంటుందా చూడాలి. 

జోరు మీదున్న కోహ్లి... 
అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకున్న విరాట్‌ కోహ్లి... ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న కోహ్లి... ‘ఆరెంజ్‌ క్యాప్‌’ రేసులో ముందున్నాడు. మరో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ఎక్కువసేపు నిలవలేకపోతుండగా... దేవదత్‌ పడిక్కల్, కృనాల్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌ మంచి టచ్‌లో ఉన్నారు. 

ముఖ్యంగా వన్‌డౌన్‌లో పడిక్కల్‌ ధనాధన్‌ షాట్లతో చెలరేగుతున్నాడు. కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ నుంచి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న చెన్నై బౌలర్లపై బెంగళూరు బ్యాటర్లంతా కలిసికట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు ఖాయమే. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్‌ దయాళ్‌ పేస్‌ భారం మోస్తుండగా... కృనాల్‌ పాండ్యా, సుయాశ్‌ శర్మ స్పిన్‌ బాధ్యతలు పంచుకుంటున్నారు. 

సమష్టిగా సత్తా చాటితేనే!  
ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ఆరంభం (2008) నుంచి ఆడుతున్న ధోని... వచ్చే ఏడాది ఆటగాడిగా లీగ్‌లో పాల్గొనక పోవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా ఈ సీజన్‌ మధ్యలో చెన్నై పగ్గాలు అందుకున్న ధోని... జట్టు విజయాల బాట పట్టించలేకపోయాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సీఎస్‌కే ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లనే తేడా లేకుండా అంతా విఫలమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఓపెనర్‌ షేక్‌ రషీద్‌... వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటుండగా... మరో యంగ్‌స్టర్‌ ఆయుశ్‌ మాత్రే ఫర్వాలేదనిపిస్తున్నాడు. స్యామ్‌ కరన్, డెవాల్డ్‌ బ్రెవిస్, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌లో ఖలీల్‌ అహ్మద్, నూర్‌ అహ్మద్‌ కాస్త నయం కాగా... మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. ప్రస్తుత స్థితిలో బెంగళూరు బ్యాటింగ్‌ జోరును అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తిమీద సామే! 

తుది జట్లు (అంచనా) 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, దేవదత్‌ పడిక్కల్, కృనాల్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ, రొమారియో షెఫర్డ్, టిమ్‌ డేవిడ్, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్‌ దయాళ్, సుయాశ్‌ శర్మ. 
చెన్నై సూపర్‌ కింగ్స్‌: ధోని (కెప్టెన్ ), షేక్‌ రషీద్, ఆయుశ్‌ మాత్రే, స్యామ్‌ కరన్, రవీంద్ర జడేజా, బ్రెవిస్, శివమ్‌ దూబే, దీపక్‌ హూడా, అన్షుల్‌ కంబోజ్, నూర్‌ అహ్మద్, ఖలీల్‌ అహ్మద్, పతిరణ.  

21 ఐపీఎల్‌ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మొత్తం 34 మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై జట్టు 21 మ్యాచ్‌ల్లో, బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్‌ రద్దు అయింది. బెంగళూరుపై చెన్నై అత్యధిక స్కోరు 226 కాగా, అత్యల్ప స్కోరు 82 పరుగులు. చెన్నైపై బెంగళూరు అత్యధిక స్కోరు 218 కాగా, అత్యల్ప స్కోరు 70 పరుగులు.  

Advertisement
 
Advertisement
Advertisement